రోజూ కాస్సేపు నడిస్తే ఆరోగ్యంగా ఉంటామన్న విషయం అందరికీ తెలిసిందే. వేగంగా నడవడం ఆరోగ్యానికీ, ఫిట్‌నెస్‌కూ చిహ్నంగా భావిస్తారు. అయితే వేగంగా నడవలేని వారి మాటేమిటి. ఈ ప్రశ్న ఒక అధ్యయనానికి దారి తీసింది.
నడి వయస్సులో వేగంగా నడవలేని వారు త్వరగా వృద్ధులవుతారని ఆ అధ్యయనం తేల్చింది. నడి వయస్సులో వేగంగా నడిచేవారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందనీ, వేగంగా నడవడం వల్ల ఎక్కువ లాభపడేది నడివయస్సు దాటుతున్నవారేననీ ఈ అధ్యయనం ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ అధ్యయనం వివరాలను మెడికల్ న్యూస్ టుడేలో ప్రచురించారు.
న్యూజిలాండ్‌లో నిర్వహించిన ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిని మూడవ ఏట నుంచీ పరీక్షిస్తున్నారు. ఆ వయస్సులోనే వారి నాడీ వ్యవస్థ సంకేతాలకు శరీరం స్పందించే తీరును నమోదు చేశారు. అప్పటినుంచీ 45 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ వారిపై రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.
వారిలో వయస్సు ఏ విధంగా పైన బడుతున్నదీ నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్, నడుము- పిరుదుల పరిమాణం నిష్పత్తి, రక్తపోటు, ట్రైగ్లిసరైడ్స్, టోటల్ కొల్లెస్ట్రాల్, హెచ్‌డిఎల్ కొల్లెస్ట్రాల్ స్థాయిలు, తెల్లరక్త కణాల కౌంట్, చిగుళ్లు, దంతాల ఆరోగ్యం వంటి అంశాలు ప్రాతిపదికగా తీసుకున్నారు.
వారి మెదడు ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఎమ్ఆర్ఐ స్కాన్ చేశారు. దీనికి అదనంగా ఎనిమిది మంది నిపుణుల ప్యానెల్‌కు వారి ఫొటోలు చూపించి ముఖ వర్ఛస్సు ఆధారంగా వయసు లెక్క వేయించారు.
నెమ్మదిగా నడుస్తున్న వారిలో మెదడు వికాసం తక్కువగా ఉన్నట్లు ఎమ్ఆర్ఐ స్కాన్లు బయటపెట్టాయి. గుండె ఊపిరితిత్తుల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి స్థాయి, చిగుళ్లు దంతాల ఆరోగ్యం లెక్కలు తీసినపుడు వేగంగా నడిచేవారితో పోలిస్తే నెమ్మదిగా నడిచేవారిలో వయస్సు ఎక్కువగా పైబడింది. 70 – 80 సంవత్సరాల వయస్సు గ్రూప్‌లో నెమ్మదిగా నడిచేవారితో పోలిస్తే వేగంగా నడిచేవారు కాస్త ఎక్కువకాలం జీవిస్తారని ముందే నిర్ధారణ అయింది. బాల్యం, నడివయస్సు మధ్యలో నెమ్మది నడక కూడా రానున్న సమస్యకు సంకేతమని ఈ అధ్యయనం ద్వారా వెల్లడయింది.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.