జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం రాయలసీమలోని ఓ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తన సీటు త్యాగం చేయడానికి సిద్దం అంటూ ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఇవేళ భేటీ అయిన సందర్భంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండు చోట్ల ఓటమి పాలైయ్యారు. అయితే రాబోయే ఎన్నికల్లో జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని వార్తలు వినబడుతుండటం, చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం జరగడం నేపథ్యంలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పందించారు..

Official: చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఏ అంశాలపై చర్చించారంటే.!?
పవన్ కళ్యాణ్ రాయలసీమ నుండి పోటీ చేయాలని వస్తే తాను సీటు త్యాగం చేయడానికి సిద్దమని ప్రభాకర్ చౌదరి ప్రకటించారు. తాను భుజస్తంధాలపై వేసుకుని గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. 2014 ఎన్నికల్లో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రభాకర్ చౌదరి .. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి అనంత వెంకటరామిరెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. ప్రస్తుతం అనంతపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా ఉండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్దం అవుతున్న ప్రభాకర్ చౌదరి.. తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రాష్ట్రంలో వైసీపీ ఓటమి, జగన్ ఇంటికి పోవడమే తమ రెండు పార్టీల (టీడీపీ, జనసేన) లక్ష్యమనీ, అందులో భాగంగా పొత్తు కుదిరితే తాను తన సీటు త్యాగం చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలకు తన వ్యూహం వేరే ఉందని పవన్ కళ్యాణ్ గతంలో పేర్కొన్నారనీ, ఈ రోజు చంద్రబాబుతో భేటీలో అందులో భాగమై ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తాము పని చేస్తామనీ, ఆయన ఎవర్ని సూచించినా వారి గెలుపునకు పని చేస్తామని తెలిపారు. మరో పక్క ఈ రోజు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావడంపై వైసీపీ నేతలు, మంత్రులు విమర్శనాస్త్రాలు సంధించారు. వారి మధ్య ముసుగు తొలగిపోయిందంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబులను తీవ్ర స్థాయిలో విమర్శించారు.
చంద్రబాబుతో పవన్ భేటీ .. వైసీపీ వర్సెస్ టీడీపీ .. విమర్శల వాగ్బాణాలు ఇలా