Balakrishna: సినిమా పరిశ్రమలో కథలు అటు ఇటు చేతులు మారుతూనే ఉంటాయి. ఒక హీరో వివిధ కారణాల చేత ఓ కథను రిజెక్ట్ చేస్తే.. మరో హీరో అదే కథతో సినిమాలు చేసి సక్సెస్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నటిసింహం నందమూరి బాలకృష్ణ సైతం తన కెరీర్ అనేక కథలను రిజెక్ట్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. బాలయ్య రిజెక్ట్ చేసిన ఓ కథతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు అన్నవరం.
భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, అసిన్ జంటగా నటించారు. సంధ్య, శివ బాలాజీ, వేణు మాధవ్, లాల్, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రలను పోషించారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా తమిళ హిట్ తిరుపాచికి రీమేక్. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మితమైన అన్నవరం 2006 డిసెంబర్ 16న విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. అదిరిపోయే కలెక్షన్స్ లో సూపర్ హిట్ గా నిలిచింది.
అప్పటికే జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం వంటి సినిమాలతో ఫ్లాపుల్లో కూరుకుపోయి ఉన్న పవన్ కళ్యాణ్.. అన్నవరంతో హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అన్నవరం మూవీకి ఫస్ట్ ఛాయిస్ పవన్ కళ్యాణ్ కాదు. ఈ తమిళ్ రీమేక్ చిత్రాన్ని మొదట పరుచూరి బ్రదర్స్ నందమూరి బాలకృష్ణతో చేయాలని భావించారు. కానీ బాలయ్యకి ఈ కథ నచ్చకపోవడంతో సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు అదే స్టోరీతో పవన్ కళ్యాణ్ తో అన్నవరంగా తీసి హిట్ కొట్టారు.