NewsOrbit
వ్యాఖ్య

మౌనం చేసే శబ్దమే వేరు!

ఎన్నికల వేళ జరిగే చర్చకు  పెద్ద ప్రాధాన్యం ఇచ్చే రోజులు కావివి. అలాగని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసే విషయమూ కాదు. మొన్న కొందరు మిత్రుల మధ్య రిజర్వేషన్ల మీద రసవత్తర చర్చ జరిగింది. అగ్ర వర్ణ నిరుపేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పది శాతం రిజర్వేషన్ అంశం మోడీకి ఈ  ఎన్నికల్లో లాభాన్ని ఆర్జించి పెట్టే కీలకమైనదిగా నిలుస్తుందని ఒక మిత్రుడు గట్టిగా వాదించాడు. దాన్ని ఒక మిత్రుడు ఖండించాడు. చర్చ ఏకంగా రిజర్వేషన్ల అవసరం..సాధ్యాసాధ్యాల మీదకు మళ్ళింది. అందమైన సాయంత్రం అడ్డంగా బద్దలైంది. ఒకే టేబుల్ని పంచుకున్న మిత్రులు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ఈ రిజర్వేషన్ వల్ల  కనీసం అగ్రవర్ణాలకైనా లాభం చేకూరుతుందా? దీని వల్ల ఇప్పటికే రిజర్వేషన్ పరిధిలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమైనా నష్టం జరుగుతుందా? పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు నెగ్గించారు సరే, సుప్రీం దీనికి అంగీకరిస్తుందా? లేదంటే రాజ్యాంగ సవరణ వీలవుతుందా? ఇలాంటి  చాలా ప్రశ్నలు వచ్చాయి. అన్నింటి కంటే ఒక మిత్రుడు చేసిన వాదన నాకు నచ్చింది. అసలు రిజర్వేషన్ల పట్ల సానుకూలత..వ్యతిరేకత అనే బేసిక్ విషయం మీద అతను పెట్టిన ఆర్గ్యుమెంట్ నా మాటల్లో పెడితే ఇలా వుంటుంది.

రిజర్వేషన్లు అంటే ప్రతిభకు విఘాతం అనేది అగ్రవర్ణాల తరతరాల రోదన. ఎప్పుడు రిజర్వేషన్ల చర్చ వచ్చినా ప్రతిభ లేని వారు కూడా రిజర్వేషన్ల ఆసరాతో అందలాలు ఎక్కుతారని వారు వాదిస్తారు. రిజర్వేషన్ల మీద  వెల్లువెత్తిన అగ్రవర్ణ ఆగ్రహం అంతా ఈ వాదన..రోదనల నేపథ్యంలోనే. ఒక వేళ అదే నిజమేమో, నిజంగా ప్రతిభావంతులకు ఈ రిజర్వేషన్ల వల్ల అన్యాయం జరుగుతుందేమో అని కొంచెం అటూ ఇటూ ఊగిసలాడే నిమ్న వర్ణ మేధావులూ ఉన్నారు. ఒక్క దెబ్బకు ఇప్పుడు మోడీ అన్ని పరదాలూ చీల్చిపారేశాడు. ఎందుకంటారా? చూడండి.

మొట్టమొదట మనం చూడాల్సింది రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే వ్యతిరేకత వెల్లువెత్తడం. కానీ ఈ అగ్రవర్ణ రిజర్వేషన్ ప్రకటన తర్వాత ఎక్కడా ఎలాంటి వ్యతిరేకతా  ఏ కోశానా వ్యక్తం కాలేదు. ఎందుకు? సహజంగా వచ్చే ప్రశ్నే ఇది. నిమ్న వర్ణాల రిజర్వేషన్ల విషయంలో ముందుకు తెచ్చే ప్రతిభా సిద్ధాంతం అంతా మిథ్యా సిద్ధాంతమేనా? కాకుంటే అదే ప్రతిభా వాదం ఇప్పుడు అదే అగ్రవర్ణ మేధావుల నుంచి ఎందుకు రాలేదు? అంటే వెనక బడిన వర్గాలకు రిజర్వేషన్లు అత్యవసరం అని వారంతా అంగీకరిస్తున్నట్టేనా? ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. అగ్రవర్ణ పేదలు కేవలం ఆర్థికంగా వెనకబడినవారు. సాంఘికంగా కాదు. ఆర్థికంగా వెనకబడినప్పటికీ, వారికి బడుల్లో..గుడుల్లో..నీళ్లల్లో..ఇళ్లల్లో..వీధుల్లో..విందుల్లో..సమస్త ప్రదేశాల్లో ప్రవేశం ఉంటుంది. ఎలాంటి అవరోధం వారు ఎదుర్కోరు. పైగా తమ బంధువర్గాల్లో పైస్థాయిలో ఉన్న వారి అండలూ ఆసరాలూ ప్రోత్సాహకాలూ అన్నీ వుండనే వుంటాయి.  కాని సాంఘికంగా వెనకబడిన వారు ఆర్థికంగానూ వెనకబాటుతనంతోనే వుండడం అతి సహజం. అది అలా వుంచి..వారికి ఎక్కడా అడుగు పెట్టే అవకాశమే లేక ఎదుగుదలకు ఏ ద్వారాలూ తెరుచుకోక ..అసలు ఎదగడానికి ఏ ప్రయత్నం చేసినా అది శిక్షార్హమైనదిగా స్మృతులు వెలిశాక..తలెత్తితే నరికేసే పరిస్థితులు నెలకొంటే..అయ్యా మాక్కూడా కాస్త అవకాశం ఇవ్వండని అర్థిస్తే..ఎన్నో దశాబ్దాలు పోరాడి రిజర్వేషన్లు సాధిస్తే వాటిని గేలి చేశారు కదా! అసమర్థులకు అవకాశం ఇచ్చినట్లయితే సమర్థులు అన్యాయమైపోతారని వాపోయారు కదా!

మరిప్పుడు ఎవరూ నోరు మెదప లేదు ఎందుకని? కేవలం ఆర్థికంగా వెనబాటుతనంతో ఉన్న వారికే రిజర్వేషన్లు కల్పించడం ఆమోదయోగ్యమైతే సాంఘికంగా ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు నూటికి నూటొక్క శాతం ఆమోదయోగ్యం కావాలి కదా? కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఇన్నాళ్ళూ వారికి ఆ అవకాశం లేదు కాబట్టి రిజర్వేషన్లు వ్యతిరేకించారు. ఇప్పుడు వచ్చింది కాబట్టి నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకున్నారు అనుకోవాలా?లేదంటే ప్రతిభావంతులు ఈపాటికే వీధుల్లోకి రావాలి కదా! గుండెలు బాదుకోవాలి కదా! ఒకప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బూట్లు పాలిష్ చేసి..చెప్పులు కుట్టి..వీధులు ఊడ్చి..పాయిఖానాలు శుభ్రం చేసి కింది వర్గాల వృత్తులను అవమానం చేశారు కదా! మరిప్పుడు అలాంటి పనులు ఏమీ ఎందుకు చేయ లేదు? ఏం చేసి తమ సహోదరులను అవహేళన చేయాలో తోచక ఆగిపోయారనుకోవాలా? అలాంటిదేమీ లేదని..రిజర్వేషన్లు వెనకబడిన వారికి అవసరమేనని వారికి నిండా తెలుసని..అయినా వారు దుర్మార్గంగా ఆ విధానాన్ని ఎద్దేవా చేశారని..ఉద్దేశ్యపూర్వకంగానే వ్యతిరేకించారని మనం అర్థం చేసుకోవాలా?  ఇంకా అర్థం కాని వారికి కూడా ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయిందనుకోవాలా?  కాబట్టి రిజర్వేషన్లు అనేవి అవసరం..అనివార్యం.. అనేది తేలిపోయింది. కనుక ఇక ఎవరూ రిజర్వేషన్లను ఏ కారణంతోనూ వ్యతిరేకించలేరు. ప్రతిభా సిద్ధాంతాన్ని పట్టుకుని  ఇక ఎంతమాత్రమూ వేళ్ళాడలేరు. ఆహా మోడీ మహాశయా..నువ్వు అగ్రవర్ణాలకు మేలు చేశావో కీడు చేశావో తెలియదు కాని, ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్న బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపావు సామీ!

ఇలా అతని వాదం విన్నాక నాకు గురజాడు మాటలు గుర్తుకొచ్చాయి. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్? నిజమే కదా. అందుకే రిజర్వేషన్లు అవసరమని ఇప్పుడిక అందరూ అంగీకరిస్తారు కాబోలు. మందగించక ముందుకడుగెయ్. వెనకబడితే వెనకెనోయ్ అని కూడా గురజాడ హెచ్చరించాడు. మంచోడి బుద్ధి మాంసం కాడ బయటపడుతుందని అంటారు. ప్రియమైన వంటకం అందరికీ సమానంగా వడ్డించేవాడే సమవర్తి. తనకు తగ్గించుకొని పక్కవాడికి కొంచెం ఎక్కువే వడ్డించే వాడు గొప్పవాడు. వెనకబడిన వాడిని తనతో పాటు ముందుకు నడిపించే వాడే వీరుడు..ధీరుడు..ధర్మజుడు అని అనుకోవాలి. అంతా సరే కానీ అల్లకల్లోలమేదో జరిగిపోతుందనుకున్న విషయం మీద చాలా నిశ్శబ్దమే అలముకుంటుంది. ఏదో కొందరు మిత్రులు కొంచెం లోపాయికారిగా వాదించుకోవడాలు..విభేదించుకోవడాలే తప్ప పెద్ద అలజడులేం జరగలేదు. నిష్కర్షగా మాట్లాడే మిత్రులు కూడా గప్ చుప్ సాంబారు బుడ్డీ అని నోటికి తాళం వేశారు.   మోడీ సర్కారు తలపెట్టిన ఈ రిజర్వేషన్ లో అగ్రకోణం మీద ఒక వ్యూహాత్మక మౌనమే చూశాం. శబ్దాన్ని అర్థం చేసుకోవడం కంటే మౌనాన్ని జీర్ణం చేసుకోవడమే కష్టం సుమా.

 

-ప్రసాదమూర్తి

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment