NewsOrbit
వ్యాఖ్య

సొంత డబ్బా కొంత మానుక…

అనగనగా ఓ పోతురాజు గురించీ, అతగాడు ఒకే దెబ్బకి రెండురాజ్యాలకు  రాజు కావడం గురించీ మీకింతకు ముందే చెప్పా కదా! రాజు కావడం ఆలస్యంగా మన పోతురాజు బ్రేకుల్లేని రథమెక్కి ప్రపంచయాత్ర చేపట్టాడు. తిరిగిన దేశం తిరిగి తిరక్కుండా తిరుక్కొచ్చి వచ్చి – చివరికి తిక్కరాజ్యం చేరాడు.
అప్పుడు తిక్కరాజ్యాన్ని మహాతిక్క జగపతి ఏలుతున్నాడు. తిక్కరాజు, నోరు విప్పితే కల్తీ లేని బూతులు! ఇక ఓ గుక్క బిగించాకా నోటితో పాటు చేతికీ పనిచెప్పేవాడు. ఈతచెట్టుకు చీరకట్టినా, ఎగిరెళ్ళి కావిలించుకునేంత రసహృదయుడు తిక్కరాజు. అయితే, ఈ సారస్యం కారణంగా, తరచూ తిక్కరాజు వొంట్లో నుంచి కేజీలకు కేజీలు ఈతముళ్లు వెలికితీయాల్సి వచ్చేది. ఇక సభా సామ్రాట్ పోతు రాజుకున్న బలహీనతల్లో అత్యంత విచిత్రమైనది ఇనపగోళ్ళ  దురద. పోతురాజు తనను తాను పొగుడుకునే వేళ అతని వేళ్ళు బిగిసిపోయి గోళ్లు పెళుసు ఎక్కిపోయేవి. జనం దృష్టిలో పడకుండా అతను తెగ బరికేసుకునే వాడు. ఆ కారణం చేత అతనికి తరచూ ప్లాస్టిక్ సర్జరీ చెయ్యవలసి వచ్చేది. ఈ రెండు రహస్యాలూ అటు తిక్కరాజుకూ, ఇటు పోతురాజుకూ వెంటనే చేరేశారు ఆయా దేశాల గూఢచారులు.
ఈ గూఢచారులెవరో కారు- దిబ్బా దిరుగుండం రాజ్యాల్లో పుట్టిన వాళ్ళే! పోతురాజు అద్భుత పాలన దెబ్బకి తట్టుకోలేక పారిపోయిన శరణార్థులు కోట్లసంఖ్యలో తిక్కరాజ్యంలో స్థిరపడిపోయారు. వాళ్లలో చాలామంది, తిక్క భాషే మాతృభాషగా మార్చేసుకున్నవాళ్ళు. అయితే, వాళ్ళందరూ దిబ్బా -దిరుగుండాల భాషలు కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నానా పాట్లూ పడి ఏడాదికోసారి స్వస్థలాలకు వెళ్లివచ్చి అక్కడి కబుర్లు ఇక్కడ- ఇక్కడి కబుర్లు అక్కడా చేరేసేవాళ్ళు.
ఏదేమైనా, తిక్కరాజుకూ, పోతురాజుకూ చూపులు కలిసిన శుభవేళ గట్టిది. దాంతో, వాళ్ళిద్దరి స్నేహం సున్నం-బెల్లం వేసికలిపిన బెందాడి గోడ మాదిరిగా అతుక్కుపోయింది. అతను సయ్యంటే ఇతను సైసై అనడం మొదలెట్టాడు. గెడ్డాలు పెంచుకున్న వాళ్ళు దుర్మార్గులని తిక్కరాజు అంటే. గెడ్డాలతో పాటు మీసాలు కూడా తీసేసిన  వాళ్ళు  రాజ ద్రోహులని పోతురాజు అనడం మొదలెట్టాడు. పొడుగు జుబ్బా తొడుక్కునే వాళ్లకు తలకాయ ఉండదని పోతురాజు అంటే, టైట్ ప్యాంటు వేసుకోనివాళ్లకు తలతిరుగుడు ఎక్కువని తిక్కరాజు అనడం మొదలెట్టాడు. పెద్దకూర తినేవాడు శుద్ధమొద్దు అవతారమని పొతురాజంటే, పందికూర తిననివాడు పనికిరాని వాడని తిక్కరాజు తేల్చిచెప్పేశాడు.
అలా, కీలకమైన విధివిధానాల విషయంలో ఏకీభావం ఏర్పడిన తర్వాత, వాళ్లిద్దరూ ప్రపంచాన్ని ఎలా పంచుకోవాలనే విషయం చర్చించేందుకు సమావేశమయ్యారు. వీళ్లకు తోడు రిపబ్లికన్ మీడియా – భేకం బాకా టీవీ కలిసి తిక్క – పోతురాజుల చెక్క భజన సాగించాయి. తిక్క – పోతు రాజుల శిఖరాగ్ర సమావేశం ప్రపంచ చరిత్రను తిరగ రాస్తుందని భేకం బాకా వ్యాఖ్యానించింది. తిక్క – పోతురాజులను వ్యతిరేకించే వాళ్ళను కాల్చి చంపాలో, ఉరి తీసి పారేయాలో జాతి తెలుసుకోవాలనుకుంటోందని రిపబ్లికన్ మీడియా గర్జించింది.
తిక్క – పోతు శిఖరాగ్ర సమావేశం దిబ్బా దిరుగుండం రాజ్యాల సరిహద్దుల్లోని కొత్వాలు కోట గ్రామంలోనే ఏర్పాటైంది. తిక్కరాజు మందీ మార్బలంతో కొత్వాలు కోటకి బయల్దేరి వచ్చాడు. దిబ్బా-దిరుగుండం రాజ్యాల్లోని అత్యంత ధనికులందరూ కొత్వాలుకోట శిఖరాగ్ర సమావేశానికి ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. సమావేశం మొదలు కావడంతోనే భూగోళం ఆకారంలో ఉన్న పెద్ద కేకును తిక్క – పోతు రాజులు చచ్చి   చెడీ కోశారు. తలోముక్కా కేకు తిన్న రెండు రాజ్యాల అతిథులూ అక్కణ్ణుంచి తప్పుకోవాలని చూశారు కానీ తిక్క- పోతు రాజులు వాళ్ళకా అవకాశం ఇవ్వలేదు. ఆత్మీయ అతిథులను కుర్చీల్లో కట్టిపారేసి, వాళ్ళను ఉద్దేశించి పోతురాజు గంభీరోపన్యాసం మొదలుపెట్టాడు. తాను గద్దె ఎక్కినా తర్వాత ఎన్ని యోజనాల బాటలు నిర్మించాడో- ఎందరు పల్లకీ బోయీలకు ఉద్యోగాలిచ్చాడో- ఎన్ని చెప్పుల జతలు కొన్నాడో- వాటిని తుడిచే నిమిత్తం ఎన్ని వందలమంది నియమితులయ్యారో- ఎన్ని కొత్త నినాదాలు ఇచ్చాడో- ఎన్నెన్ని కావ్యాలు అంకితం పుచ్చుకున్నాడో- ఏకరువు పెడుతూ పోయాడు. ఏడెనిమిది గంటల తర్వాత హాల్లో ఒక్క శ్రోత కూడా స్పృహలో లేడని నిర్ధారించుకున్న తర్వాత తిక్క రాజు -తనకు వచ్చిన ఒకే భాష- “సంస్కృతం”లో పోతురాజుకు హితవు చెప్పాడు. యథాతథంగా అదివింటే మీ మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని భయపడి, మనుషుల భాషలోకి దాన్ని మార్చి ఇక్కడ ఇస్తున్నా చదువుకోండి:
“మహాకవి, సొంతలాభం సాంతం మానుకోమని అనలేదు- “సొంత లాభం కొంత మానుక, పొరుగువాడికి తోడుపడవోయీ!” అని మాత్రమే అన్నారు.మహాకవి దాటిపోయి నూరేళ్లు దాటిపోయింది. ఆయన పాటల్ని మనం కాలానుగుణంగా మార్చుకోవాలి మరి! ముఖ్యంగా మన రాజకీయ జంతువుల విషయంలో కాలానుగుణమయిన ఈ సవరణలూ, సంస్కరణలూ మరింత అవసరం!! అందుకే “సొంత డబ్బా కొంతమానుక పొరుగుడబ్బా కొట్టవోయ్!” అని ఈ కాలపు రాజకీయుల్ని ఉద్దేశించి మనం పాడుకోవాలి అంటాన్నేను!ఉదాహరణకి ఒక దేశాధినేత, తమ దేశంతో స్నేహ సంబంధాలు కలిగివున్న మరో దేశానికి వెళ్లారనుకో – అక్కడ కూడా తమడబ్బాయే వాయిస్తే ఎలా? డిప్లమసీ అనే జీవనాటకంలో భాగంగా అక్కడ వాళ్ళ డబ్బా -కొంతైనా- వాయించక తప్పదు కదా! కానీ నువ్వు గంటల తరబడి నీ గులకరాళ్ల డబ్బానే మోగిస్తూ, అదే గొప్ప సంగీతమని డబాయించడం భావ్యమేనా? మా చెవుల్లో కాలీఫ్లవర్స్ కనిపిస్తున్నాయా?” అంటూ తిక్కరాజు పోతురాజును దులిపేశాడు. పోతురాజు సీక్రెట్ గా నాలిక్కరుచుకుని, ప్లాస్టిక్ సర్జన్ ఆసుపత్రివైపు దూసుకుపోయాడు- నెత్తురోడ్చుకుంటూ!

-మందలపర్తి కిషోర

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment