రజనీ దాగుడుమూతలు..! నెలకో సాకు.., అరవ సోకు..!!

వెంకటేశ్ ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘నువ్వు మరీ తమిళ సినిమా హీరోలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్’ అని. తమిళ హీరోల అతికి ఇది తెలుగు వెటకారం. జనాలు నమ్మరేమో.. అనే ఆలోచనే లేకుండా హీరోయిజం చూపిస్తారు. ఇందులో ‘రజినీకాంత్’ కు సెపరేట్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఓ సినిమాలో విలన్ జీప్ ఫుల్ ఎక్సలేటర్ ఇచ్చినా కదలదు.. కారణం రజినీ ఆ జీప్ కు తాడు కట్టి ఆ తాడు మీద సింగిల్ లెగ్ పెట్టి చాలా కూల్ గా నుంచుంటాడు. జీప్ కదలదంతే. అదే రజినీ. ఇప్పుడు తన మ్యానియాను రాజకీయాల్లో చూపేందుకు సిద్ధమవుతున్నాడు.

rajinikanth style dilemma about his political entry
rajinikanth style dilemma about his political entry

రజినీ రాజకీయం.. రెండు దశాబ్దాల క్రితమే..

1999 నరసింహలో రజినీ రాజకీయాల్లోకి రావాలనే డైలాగ్ ఉంటుంది. అప్పటినుంచీ ఊరిస్తునే ఉన్నారు రజినీ. జయలలిత, కరుణానిధి ఉండగా చేయని ధైర్యం ఇప్పుడు చేస్తున్నారు. రజినీ మక్కల్ మండ్రమ్.. అని ఫ్యాన్స్ తో మీటింగ్ పెట్టారు.. ఫొటోలు దిగారు. బాబా సినిమా సింబల్ చూపారు. రాజకీయ పార్టీ పెడతాను.. కానీ సీఎం వేరే వ్యక్తిని చేస్తాను.. వయసు రీత్యా నేను అధ్యక్షుడిగా ఉంటాను అన్నారు. ‘నువ్వు ఓడిపోవటమేంటయ్యా..’ అని 2019 ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ నాయకుడిని చూసి కొందరు కన్నీళ్లు పెట్టుకున్నట్టు.. రజినీ మాట విని ఓ అభిమాని గుండె ఆగిపోయింది. అప్పుడూ.. 2019 ఎంపీ ఎన్నికలప్పుడూ పార్టీపై రజినీ స్పందించలేదు. 2021లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. రజినీ నుంచి ఇప్పుడూ చప్పుడు లేదు.

రాజకీయాల్లోకి వస్తా.. కానీ..

దీంతో ఓ తుంటరి.. ‘నేను రాజకీయాల్లోకి రాను. నాకు కిడ్నీ మార్పిడి జరిగింది. వయసురీత్యా రాజకీయాలు వద్దని డాక్టర్లు చెప్పారు’ అని ఓ లెటర్ వైరల్ చేసాడు. అభిమానుల్లో కంగారు మొదలైంది. ఆయన ఇంటి ముందు వాలిపోయారు. ‘ఆ లేఖ నాది కాదు.. అందులో నా ఆరోగ్య వివరాలు నిజమే.. కానీ రాజకీయాల్లోకి వస్తాను’ అని రజినీ స్పందించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇలాంటి సినిమా ట్రిక్స్ హీరోలకు కామనే. గతంలో ఓసారి ఫ్యాన్స్ అందరూ జయలలితకు ఓటేయాలని పిలుపునిచ్చారు రజినీ. ఆ ఎన్నికల్లో జయలలిత ఓడిపోయారు. అంటే.. సినిమా మ్యాజిక్ అప్పుడే పని చేయలేదు. రోజులు మారాయి. సొంత పార్టీ కాబట్టి సినిమాల తరహాలో రాజకీయాల్లో పేలుతుందేమో చూడాలి.. ‘హీరోయిజం’.