YS Sharmila Party : తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు రెండు సంచలనాలు నమోదవడం రాజకీయంగా ఏపీ, తెలంగాణ ఏస్థాయిలో ఉంటాయో మరోసారి చాటిచెప్పినట్టైంది. వైఎస్ షర్మిల YS Sharmila Party ఏపీలో ఏడాదిగా నలుగుతున్న పంచాయతీ ఎన్నికల తుఫాను మొత్తానికి తీరం దాటి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య జరిగిన పోరు ముగిసింది. నిన్న (ఫిబ్రవరి 9) తొలివిడత ఎన్నికలు కూడా ముగిసాయి. ఫలితాలు వస్తున్నాయి. వైసీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని దూసుకుపోతోంది. ఇక తెలంగాణలో అనుకోని సునామీ అక్కడి రాజకీయాల్ని కుదిపేసింది. జగనన్న వదిలిన బాణం తెలంగాణలో పడింది. సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. రాజన్న రాజ్యం అక్కడ కూడా రావాల్సి ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు జరిగిన ఈ రాజకీయ అలజడిని పరిశీలిస్తే..

పార్టీల పోటా పోటీ..
పార్టీ గుర్తులతో సంబంధం లేకపోయినా ప్రధాన పార్టీలు బలపరచిన అభ్యర్ధులతో ఏపీ పంచాయతీ ఎన్నికలు రాజకీయ వేడిని పుట్టించాయి. ఎన్నికలకు భయపడుతున్నారని ఎద్దేవా చేసిన టీడీపీ శ్రేణులకు షాకిచ్చేలా వైసీపీ మెజార్టి స్థానాల్లో దూసుకుపోతోంది. ప్రస్తుతానికి మీడియా వర్గాల సమాచారం ప్రకారం వైసీపీ 2347 స్థానాల్లో.. టీడీపీ 534 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 70 శాతం వైసీపీ గెలుచుకోగా.. 29 శాతం టీడీపీ.. మిగిలిన ఒక్క శాతం ఇతరులు గెలుచుకున్నట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసి ఎన్నికల కమిషన్, కరోనా కారణంగా నిర్వహించమంటూ ఇద్దరి మధ్య పోరులా మారిపోయిన ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఒకరికొకరు పంతాలకు వెళ్లి ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను హీరోను చేశారు. పార్టీ గుర్తులతో సంబంధం లేని ఎన్నికల్లో ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్ధులైనా అధికార పార్టీతో కలసి పనిచేయాల్సిందే. లేదంటే గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనికైనా సర్పంచ్ కు నిధులు లభించడం కష్టమే. కాకపోతే.. మద్దతు ఇచ్చే పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. మరో 11 రోజుల్లో మిగిలిన మూడు విడతలు కూడా పూర్తవుతాయి.
షర్మిల సంచలనం..
ఏపీలో అలా అయితే.. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటోంది. ఎవరైనా కొత్త పార్టీ పెడితే వేరు కానీ.. ప్రజాదరణ, రాజకీయాల్లో మాస్ ఇమేజ్, రాజకీయాల్ని శాసంచిన కుటుంబాల వ్యక్తులు, సినిమా వ్యక్తులు పార్టీ పెడితే ఆ కిక్కు, సంచలనం వేరే స్థాయిలో ఉంటుంది. అటువంటి సంచలనానికే నాంది పలికారు వైఎస్ షర్మిల. తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపారు. పార్ ఏర్పాటు నిర్ణయం పూర్తిగా షర్మిల నిర్ణయమని.. సీఎం జగన్ కు ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అయితే.. రాయలసీమ బిడ్డ, మాజీ సీఎం కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కు సోదరి అయిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటో ఇప్పటికీ సామాన్యులకు అర్ధం కాని విషయం. తెలంగాణలో కూడ ఇప్పటికీ వైఎస్ అభిమానులు ఉన్నారనేద నిజం. అయితే.. వారి ఉనికి కోసమో, తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్న మాటలైతే అబద్దమనే చెప్పాలి. తెలంగాణలో ఏదొక బలమైన పార్టీనో, వ్యక్తులో లేకుండా షర్మిల ఇంత ధైర్యం చేస్తారని చెప్పలేం. ఎందుకంటే..
షర్మిలకు తెలంగాణ పట్టం కడుతుందా..?
తెలంగాణ ఏర్పడిందే ఆంధ్రోళ్ల పెత్తనం అనే మాటపై. ఇప్పుడు అదే ఆంధ్రకు చెందిన షర్మిల పార్టీ తెలంగాణలో పెడితే సహకరించేది ఎవరు? అసలు షర్మిల పార్టీ ఉంటుందా..? 135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ అక్కడ కుంటుతుంటే.. 35 ఏళ్ల అనుభవం ఉన్న తెలుగుదేశం పూర్తిగా చతికిలపడిపోయింది. బీజేపీ ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తోంది. తెలంగాణ ప్రాంత సెంటిమెంట్ ఉన్న ఆ ప్రాంతంలో షర్మిల పార్టీ నిలదక్కుకోగలదా? తెలంగాణ ప్రజలు ఏపీ నుంచి వచ్చిన షర్మిలకు అధికారం అప్పగిస్తారా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు షర్మిల పార్టీ ఏర్పాటుపై వైఎస్ మీద అభిమానంతో ఆచితూచి మాట్లాడారు. రేవంత్ రెడ్డి, వీహెచ్ మాత్రం జగన్ కాదు.. కేసీఆర్ వదిలిన బాణం అని ఓట్లు చీల్చి.. టీఆర్ఎస్ కు లాభం చేకూర్చమే షర్మిల లక్ష్యం అన్నారు. ఇప్పుడు కాకపోయినా అసెంబ్లీ ఎన్నకలకైనా ఈ గుట్టు బయటకు వస్తుంది. మొత్తంగా రెండు రాష్ట్రాలు.. రెండు సంచలనాలు.. ఒకే రోజు. దటీజ్ తెలుగు పాలిటిక్స్.