Delhi Liquor Scam-MLC Kavita: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే అరోరా, అరుణ్ రామచంద్ర పిళ్లై, పినాక శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ తదితరుల అప్రూవర్ లుగా మారారు. అయితే ఈ కేసులో ఇప్పటికే పలు మార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించగా, తాజాగా మరో సారి విచారణ కు రావాల్సిందిగా నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం ఈడీ విచారణకు హజరుకావాలంటూ కవితకు ఈడీ నుండి నోటీసులు అందాయి. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ సీఎం కేసిఆర్ తనయ కవితకు ఈడీ నుండి నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

అయితే ఈడీ నోటీసులపై తన దైన శైలిలో స్పందించారు ఎమ్మెల్సీ కవిత. మోడీ నోటీసులు అందాయంటూ పేర్కొన్నారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న కవిత .. మీడియాతో మాట్లాడుతూ ఇవి రాజకీయ కక్షలో భాగంగా వచ్చిన నోటీసులుగా భావిస్తున్నామని, నోటీసును పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నోటీసును పార్టీ లీగల్ టీమ్ కు ఇచ్చామనీ, లీగల్ టీమ్ సలహా ప్రకారం ముందుకు వెళతామని చెప్పారు. ఇది ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉందని, టీవీ సీరియల్ మాదిరిగా దీన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. మళ్లీ ఒక ఏపిసోడ్ రిలీజ్ చేస్తున్నారన్నారు. నోటీసులు సీరియస్ తీసుకోవద్దు. ఈ విచారణ ఎంత కాలం కొనసాగుతుందో తెలియదన్నారు. గతంలో 2 జీ విచారణ కూడా చాలా కాలం సాగిందని, తెలంగాణ ప్రజలు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోరని అన్నారు కవిత.

కేంద్రంలోని బీజేపీ పెద్దలు, బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందం కుదరడం వల్లనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై విచారణను పక్కన పెట్టారంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఈ కారణంగానే బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన పలువురు నేతలు బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ రోజు నోటీసులు ఇచ్చి రేపు హజరు కావాలని ఈడీ పేర్కొనడంతో ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో కవిత శుక్రవారం విచారణకు హజరయ్యే అవకాశం లేదని అంటున్నారు. లీగల్ టీమ్ తో సంప్రదింపులు జరిపి విచారణకు మరో తేదీ ఖరారు చేయాలని ఈడీకి లేఖ రాసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సౌత్ గ్రూప్ లో కీలకమైన వ్యాపార వేత్తలు కేసులో అప్రూవర్ లుగా మారడంతో కవిత అరెస్టు ఉంటుందా ఉండదా అన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.