YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆంధ్ర షర్మిల .. గోబ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని తొలుత వార్తలు వచ్చినా ఆ చర్చలు ఫలప్రదం కాకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని షర్మిల ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఎన్నికల్లో దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం తొలి నుండి షర్మిల తో నడిచిన నేతలకు ఆగ్రహం తెప్పించింది.

ఆ పార్టీ సీనియర్ నేత గట్టు రామచంద్రరావు నేతృత్వంలో పలువురు కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఇవేళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సమాజం నుండి వైఎస్ షర్మిలను బహిష్కరించాలన్నారు. తమను షర్మిల నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తెలంగాణలో తిరిగితే అడ్డుకుంటామని హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి పేరును షర్మిల చెడగొట్టారని అన్నారు. ఇన్ని రోజులు షర్మిలకు మద్దతుగా ఉన్నందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నామన్నారు. షర్మిల రాజకీయాలకు అసలు పనికి రాదంటూ గట్టు రామచంద్రరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ భవిష్యత్తు కార్యచరణ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
ఇలా పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి నీలం రమేష్ స్పందిస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ టీపీ శ్రేణులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కేవలం ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయలేదని అన్నారు. పార్టీ లేదనీ, పార్టీని ఇక నడపరని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతో పార్టీ అధినేత్రి త్యాగం చేశారు తప్ప మోసం కాదని ఆయన పేర్కొన్నారు.
PM Modi: కేసిఆర్ సర్కార్ పై ప్రధాని మోడీ సంచలన కామెంట్స్