బెంగాల్ ఘర్షణలు, ముగ్గురు మృతి!

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు, బిజెపి వ్యాప్తిని అడ్డుకునేందుకు తృణమూల్ చేస్తున్న ప్రయత్నాలు ఆ రాష్ట్రంలో తీవ్ర ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరు బిజెపి కార్యకర్తలు, ఒక తృణమూల్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు.

నయజాత్ ప్రాంతంలో, హత్‌గచ్చా పంచాయితీ పరిధిలో బహరంగ ప్రదేశాల నుంచి పార్టీ జెండాలు తొలగించడం దగ్గర మొదలయిన ఘర్షణ ప్రాణనష్టానికి దారి తీసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఆ ప్రాంతానికి పంపించారు.

మరోపక్క హుగ్లీ జిల్లాలో జరిగన ఘర్షణలో తమ కార్యకర్త ఒకరు మరణించారనీ, ఆయిదుగురు కనబడకుండా పోయారనీ బిజెపి నాయకులు అంటున్నారు. హత్‌గచ్చా దగ్గర జరిగిన ఘర్షణల్లో ఖయూమ్ మొల్లా అనే తృణమూల్ కార్యకర్తను కాల్చిచంపారు. అతనిపై గొడ్డళ్లతో కూడా దాడి చేశారు. ఆ ఘర్షణల్లో ప్రదీప్ మొండల్, సుకాంత మొండల్ అనే ఇద్దరు బిజెపి కార్యకర్తలు మరణించారు.