కర్షకులకు ఎనలేని కడగండ్లు


అమరావతి, డిసెంబరు 20 : తుఫాన్  కోస్తా జిల్లాల్లో కర్షకులకు ఎనలేని కడగండ్లు తెప్పించింది. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రధానంగా వరి పండించిన రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చి కాసులు కురిపిస్తుందనుకుంటున్న తరుణంలో కురిసిన వర్షాలు తీవ్రనిరాశకు గురిచేశాయి. వరి పండించిన పంట పోలాల్లో నీరు నిలిచిపోవడంతో పనలు తేలిపోయి గింజలు నేలరాలిపోయాయి. ఇటువంటి తరుణంలో తడిసిన పంటనైనా దక్కించుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కోతకు వచ్చిన పంట నీటిలో నానుతుండటంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తీర ప్రాంత గ్రామాల్లో రైతులు తడిసిన ధాన్యాన్ని రోడ్లపైన ఆరబోసి ఎండబెట్టుకుంటున్నారు. నీట మునిగిన పొలాల్లోని పంటను కొంతమేరైనా కాపాడుకోవాలనిరైతాంగం ముంపు నీటిని ఇంజన్ల సహాయంతో బయటకు పంపుతున్నారు.  తుఫానుకు ముందుగా కోసిన పైరు పూర్తిగా నీటిలో మునిగిపోయి కుళ్ళి పోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగం బావురుమంటున్నారు.

కూలీల కొరత
గోరుచుట్టుపై రోకలి పోటు అన్నసామెత లాగా నీటమునిగిన వరి ఓదెలను బయటకు తీసుకువచ్చేందుకు కూలీల కొరత ప్రధాన సమస్యగా రైతాంగానికి ఎదురౌతున్నది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతాంగానికి ఒక్కసారిగా కూలీల అవసరాలు తలెత్తాయి. దీంతో ప్రతిఏటా కోతలకు వచ్చే కూలీలు డిమాండ్ పెరగడంతో కూలీ ధరలను ఒక్కసారిగా 50శాతానికి పైగా పెంచడంతో రైతులు ఏంచేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో ఓదెలు తిప్పేందుకు అవకాశంవుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనాకు వస్తున్నారు. సమీప జిల్లాలనుంచి రైతువారీపనులకు వచ్చే కూలీల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

వరికోత యంత్రాల సహాయంతో కోత కోయడానికి పొలంలో నీరు బయటకు వెళ్ళిన సుమారు వారం రోజులకు గానీ అవకాశంవుండదు. ఇటువంటి తరుణంలో కూలీలపైనే రైతాంగం పూర్తిగా ఆధారపడాల్సివస్తోంది. తుఫానుకు ముందు ఎకరానికి రూ. 500నుంచి 700కు వచ్చే కూలీలు ఇప్పుడు రూ. 1000 డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓదెలు తిప్పి కుప్పలు కట్టేందుకు ఎకరానికి రూ. 5వేలదాకా కూలీలు డిమాండ్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వానల కారణంగా నష్టపోయిన రైతాంగం తీరా ధాన్యం చేతికి వచ్చేసరికి దళారులు రంగంలోకి దిగి ధాన్యం తడిసిపోయిందని, రంగు మారిందని, నాణ్యత లేదంటూ సాకులు చెబుతూ తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను యధాతధంగా కొనుగోలు చేసి ఆదుకోవాలని వరి పండించిన రైతాంగం వేడుకుంటోంది