జనసేనాని ఆంధ్రా కుమార స్వామి కానున్నారా?

Share

విజయవాడ, డిసెంబర్ 20 : రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎప్పుడు ఏన్నికలు వచ్చినా గెలుపే లక్ష్యంగా పని చేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లి తెరాసా అధినేత కల్వకుంట్ల  చంద్రశేఖరరావు తెలంగాణాలో విజయ బావుటా ఎగుర వేయడంతో కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేయవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. తెలంగాణాలో మాదిరిగా భారతీయ జనతా పార్టీకి ఆంద్రప్రదేశ్‌లోని అసెంబ్లీలో స్థానాల్లో కూడా ఎక్కడా అంతగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రధానంగా అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉండే అవకాశం ఉండగా, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన ప్రధాన పార్టీల్లో గుబులు రేకెత్తించే పరిస్థితి. పలు జిల్లాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేయనుండటంతో పాటు కర్నాటకలో మాదిరిగానే ఇక్కడ కూడా జనసేనకు అధికార పీఠాన్ని డిసైడ్ చేసే స్థానాలు వస్తాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

గతంలో పవన్ అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో  తెలంగాణలో ఒకటితో కలిపి 18 స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రధాన ప్రతిపక్షానికి వెళ్లకుండా జనసేన క్యాష్ చేసుకునే అవకాశం ఉందని, తద్వారా అది అధికార పార్టీకి లాభిస్తుందని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో జనసేన పొత్తు పొడవాలని కేంద్రంలోని బీజెపి పెద్దలు, జగన్మోహనరెడ్డి సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల ఒడంబడికపై సన్నిహితుల ద్వారా చర్చలు జరిగినా అవి ఫలించలేదని, దీంతో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రావాలి జగన్, కావాలి జగన్ పేరుతో వైకాపా ఇంటింటికీ తిరుగుతూ నవరత్న పథకాలు వివరిస్తుండగా, తెదేపా గ్రామదర్శని, గ్రామ వికాసం పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ జనంలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, గతంలో తనకు ముఖ్యమంత్రిగా అనుభవం, వయసు సరిపోదని పేర్కొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నాటక ఎన్నికల తరువాత స్వరం పెంచి మరీ ప్రసంగాలు చేస్తుండటంతో రాబోయే రోజుల్లో ఆయన ఆంద్ర కుమార స్వామి కావచ్చని కూడా వినిపిస్తోంది.


Share

Related posts

ముస్లిం అమ్మకు హిందూ బేటా అల్విదా!

Siva Prasad

వేదనిలయం జప్తు కింద ఉందట!

Siva Prasad

తెలంగాణలో మునుపెన్నడూ లేని కొత్త సమస్య..!

somaraju sharma

Leave a Comment