వెలుగొండలో ఎంత మిగులు!?

అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ నిర్మాణ పనుల రివర్స్ టెండరింగ్‌లో ప్రభుత్వ ఖజానాకు ఎంత మేర లాభం చేకూరనుందో నేడు తేలనుంది.

వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారీ ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టర్‌లకు పనులు అప్పగించాలనీ తద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదా అవుతుందనీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ముందుగా పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్‌ నిర్వహిస్తే దాదాపు 750 కోట్ల రూపాయలు ఆదా అయినట్లు ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే.

వెలుగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్‌లో మిగిలిన పనులకు జలవనరుల శాఖ 638 కోట్ల రూపాయల అంచనా విలువతో టెండర్లను ఆహ్వానించగా పనులు దక్కించుకునేందుకు నాలుగు సంస్థలు పోటీ పడ్డాయి.

మేఘా ఇంజనీరింగ్, రిత్విక్ ప్రాజెక్టు, ఆర్ ఆర్ కంపెనీ, పటేల్ ఇంజనీరింగ్ కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. శనివారం మధ్యాహ్నం ఈ  టెండర్లు తెరవనున్నారు. తొలుత ఆర్థిక బిడ్ తెరిచి ఎల్-1 ఎంత మొత్తమో నిర్ణయిస్తారు. ఆ మొత్తంపై తిరిగి రివర్స్ టెండర్ల ప్రక్రియ నిర్ణయిస్తారు. అందరి కన్నా తక్కువ మొత్తానికి ఈ పని చేసేందుకు ఎవరు ముందుకు వస్తారో వారికి పనులు అప్పగించనున్నారు.