పుల్వామా లాంటి దాడి మామూలే

ఎప్పుడూ అలాంటివి జరుగుతాయి
పాక్ మీద వైమానిక దాడి సరికాదు
రాహుల్ సన్నిహితుడు శాం పిట్రోడా
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడిని సమర్ధిస్తూ రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుడు శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం అధ్యక్షుడు, టెలికం రంగ నిపుణుడు కూడా అయిన పిట్రోడా.. భారత వైమానిక దళం పాకిస్థాన్ మీద దాడి చేయడాన్ని తప్పుబట్టారు. ‘‘వాళ్లు (వైమానిక దళం) 300 మందిని చంపితే, అది పర్వాలేదు. కానీ, దాని గురించి మీరు నాకు మరిన్ని నిజాలు చెప్పి, వాటిని రుజువు చేయగలరా’’ అని ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఎవరో వచ్చి దాడి చేస్తే దానికి ఒక దేశాన్ని తప్పుబట్టడం సరికాదని అన్నారు.

‘‘దాడుల గురించి నాకు ఎక్కువ తెలియదు. కానీ అవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇంతకుముందు ముంబై మీద కూడా ఉగ్రవాద దాడులు జరిగాయి. మనం అప్పుడు కూడా స్పందించి, మన విమానాలు పంపి ఉండచ్చు. కానీ అది సరైన పద్ధతి కాదు. ప్రపంచంతో మనం వ్యవహరించాల్సిన తీరు అది కాదని నా అభిప్రాయం’’ అని శాం పిట్రోడా అన్నారు. పాకిస్థాన్ లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై జరిగిన వైమానిక దాడులకు సంబంధించిన వాస్తవాలేంటో భారతదేశ ప్రజలకు తెలియాలని చెప్పారు.

కేవలం కొద్దిమంది ఉగ్రవాదుల కారణంగా పాకిస్థాన్ ను శిక్షించడం సరికాదని కూడా పిట్రోడా వ్యాఖ్యానించారు. 26/11 ఉగ్రవాద దాడులను ప్రస్తావిస్తూ ‘‘అప్పట్లో 8 మంది ఉగ్రవాదులు ఇక్కడికొచ్చి, ఏదో చేశారు. కానీ దానికి మొత్తం దేశాన్ని (పాక్) తప్పుబట్టకూడదు. కొంతమంది వ్యక్తులు ఇక్కడికొచ్చి మనమీద దాడి చేశారని ఆ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి మీద నెపం నెట్టకూడదు. నేను అలాంటివి నమ్మను’’ అని ఆయన అన్నారు. నరేంద్రమోదీ తీసుకున్నంత వేగంగా మన్మోహన్ సింగ్ నిర్ణయాలు తీసుకునేవారా అని పిట్రోడాను ఏఎన్ఐ ప్రశ్నించింది. దానికి, దేశంలో ఇప్పటివరకు ఉన్న ప్రధానులలో అత్యుత్తమ ప్రధాని మన్మోహనే అని చెప్పారు. ‘‘చాలామంది ఆయనను ఎద్దేవా చేశారు, చాలామంది కథనాలు రాశారు, కొంతమంది సినిమాలు కూడా తీశారు. అదంతా బోగస్’’ అన్నారు. 2014 నుంచి భారత్, అమెరికాలలో ఒకేలాంటి ప్రభుత్వాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘సరిహద్దులలో శత్రువు ఉన్నాడని చెప్పి భయపెట్టడమే వారి ఫార్ములా. భారతదేశంలో అది పాకిస్థాన్ అయితే అమెరికాలో మెక్సికన్ వలసదారులు. ఎవరూ సమర్ధులు కారు కాబట్టి ప్రతి ఒక్కరూ చెడ్డవారు కారని అంటారు’’ అన్నారు.