మాల్ మూడో అంతస్తు నుంచి విసిరివేత
ఆసుపత్రిలో కోలుకుంటున్న ఐదేళ్ల బాలుడు
అమెరికాలోని మిన్నెసోటా ప్రాంతంలో ఒక మాల్ మూడో అంతస్తు బాల్కనీ నుంచి ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిని కిందకు తోసేశాడు. పిల్లవాడు క్షేమంగా ఉన్నాడని, జూన్ నాటికి ఇంటికి కూడా వచ్చేస్తాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏప్రిల్ 12న బ్లూమింగ్టన్ మాల్ లో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లాండెన్ హాఫ్ మన్ కోసం నిధుల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 28 వేల మంది కలిసి పది లక్షల డాలర్లు మేరకు విరాళాలు ఇచ్చారు.
తమ కుమారుడు ఇప్పుడు క్షేమంగా ఉన్నాడని, చాలా అప్రమత్తంగానూ ఉంటున్నాడని, అతడికి ఇక ప్రమాదం ఏమీ లేనట్లేనని వారి కుటుంబ న్యాయవాది ఓ ప్రకటనలో చెప్పారు. ఇప్పుడు అతడికి అదనపు సర్జరీలు, కోలుకోవడం, పునరావాసం చివరకు ఇంటికి వెళ్లడంపై దృష్టిపెట్టామని, బహుశా జూన్ నాటికి అతడు వచ్చేస్తాడని అన్నారు. మిన్నెపోలిస్ ప్రాంతానికి చెందిన ఇమాన్యుయేల్ అరండా (24) ఆ బాలుడిని కిందకు తోసేసినందుకు అతడిపై ఫస్టి డిగ్రీ మర్డర్ కేసు పెట్టారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న అతడు.. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి పిల్లాడిని కింద పారేశాడు. తాను చాలా కాలం నుంచి మాల్స్ వద్దకు వెళ్లి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని, కానీ వాళ్లు తిరస్కరించడంతో బాగా కోపం వస్తోందని అతడు ఒప్పుకొన్నాడు. తొలుత ఎవరైనా పెద్దవాళ్లను చంపేద్దామనుకున్నానని, కానీ చివరకు ఆ పిల్లాడిని ఎంచుకున్నానని అరండా చెప్పినట్లు పోలీసులు తెలిపారు.