(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రెండవ ప్రపంచ యుద్ధంలో సైనిక సమాచారం చేరవేతకు జర్మన్లు దుర్భేద్యమైన కోడ్ ఉపయోగించేవారు. దానిని ఛేదించడం చాతగాక మిత్ర రాజ్యాల కూటమి చాలా కాలం తలలు బద్దలు కొట్టుకుంది. చివరికి బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త ఎలాన్ ట్యూరింగ్ దానిని ఛేదించాడు. దానికోసం ఆయన ఒక ఎలక్ట్రో మెకానికల్ మెషిన్ రూపొందించాడు. ఈనాటి కంప్యూటర్కు మూలం అదేనని చెప్పవచ్చు.
జర్మన్ల మిలటరీ కోడ్ను ట్యూరింగ్ ఛేదించినందువల్లనే హిట్లర్ ఓటమి సాధ్యపడిందని అనేవారు ఉన్నారు. అంత కాకపోయినా కనీసం యుద్ధం త్వరగా అంతమయింది. అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిన నౌకా యుద్ధంలో మిత్రరాజ్యాలది పైచేయి కావడానికి కారణం జర్మన్ల కోడ్ తెలిసిపోవడమే. వేలాది ప్రాణాలను ట్యూరింగ్ గణిత శాస్త్రప్రతిభ కాపాడింది.
అంత ఘనకార్యం సాధించిన వ్యక్తి జీవితం చివరికి విషాదంగా ముగిసింది. స్వలింగ సంపర్కం అభియోగంపై 1952లో ట్యూరింగ్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ నేరానికి శిక్ష కింద ఆయనకు రసాయన ప్రయోగం ద్వారా పుంసంత్వం లేకుండా చేశారు. స్వలింగ సంపర్కం బ్రిటన్లో 1967 వరకూ శిక్షార్హమైన నేరం.
అవమానభారంతో ట్యూరింగ్ 1954లో 41వ ఏట సైనేడ్ మింగి ఆత్యహత్య చేసుకున్నాడు. మానవ జీవితాన్ని విప్లవాత్మకమైన మలుపు తిప్పిన కంప్యూటర్ పరిజ్ఞానానికి ఆద్యుడైన గణిత శాస్త్ర మేధావి జీవితం ఆ విధంగా పిన్నవయస్సులో విషాదంగా మగిసింది.
ఎలిజబెత్ మహారాణి 2013లో ట్యూరింగ్కు మరణానంతరం క్షమాభిక్ష ప్రసాదించారు. 2017లో ఒక కొత్త చట్టం కింది బ్రిటన్, అంతకుముందు స్వలింగసంపర్కం నేరానికి శిక్షలు అనుభవించిన వేలాదిమందికి గంపగుత్తగా క్షమాభిక్ష ప్రకటించింది. ఆ చట్టం పేరు ట్యూరింగ్ చట్టం.
ఇప్పుడు బ్రిటన్ ట్యూరింగ్ చిత్రాన్ని కొత్త 50 పౌండ్ల కరెన్సీ నోటుపై ముద్రిస్తున్నది. దీనికోసం కృషి చేసిన స్వలింగ సంపర్కుల హక్కుల పోరాటం కార్యకర్త పీటర్ తాచెల్, ఇంగ్లండ్ కరెన్సీ నోటుపై మొదటిసారి ఒక స్వలింగ సంపర్కుడి చిత్రం ముద్రించడం గొప్ప విషయమని అన్నారు. 20 వ శతాబ్దపు గొప్ప మేధావులలో ఒకరైన ఎలాన్ ట్యూరింగ్కు అక్షరాలా తగిన సత్కారం ఇది అన్నారాయన.
ట్యూరింగ్ చిత్రంతోపాటు కృత్రిమ మేధ గురించి ఆయన అన్న ఒక మాటను కూడా 50 పౌండ్ల నోటుపై ముద్రిస్తున్నారు: “రాబోయే దానికి ఇది రుచి మాత్రమే. కాబోయే దానికి ఇది ఛాయ మాత్రమే”.