నవాజ్ షరీఫ్‌కు 8వారాల బెయిల్:ఆరోగ్యపరిస్థితి విషమం

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు ఎనిమిది వారాలు బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నందున వైద్య సేవలు పొందేందుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాహోర్‌లోని సర్వీసెస్ హాస్పిటల్‌లో ఈ నెల 21వ తేదీ నుండి ఆయన చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ట్రీట్‌మెంట్ సమయంలోనే ఆయనకు గుండె పోటు వచ్చింది. దాని నుండి కోలుకున్నట్లు వైద్యలు చెప్పినప్పటికీ ప్లేట్‌లెట్స్ సంఖ్య క్రమంగా తీవ్రస్థాయిలో పడిపోయినట్లు డాక్టర్‌లు చెబుతున్నారు. ప్లేట్‌లెట్‌ల సంఖ్య పడిపోవడంతో షరీఫ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు గతంలో మంజూరు చేసిన బెయిల్ గడువు నేటితో ముగియడంతో ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించగా ఎనిమిది వారాలు బెయిల్ మంజూరు చేసింది.

మరో వైపు షరీఫ్‌కు మెరుగైన చికిత్స అందించాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైద్యులను ఆదేశించారు.