సహకరిస్తాం – పెట్టుబడులు పెట్టండి


(న్యూస్ఆర్బిట్‌ బ్యూరో)
అమరావతి, డిసెంబర్ 27: సింగపూర్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న మీరు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి రావాలని ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. సింగపూర్‌లోని పలువురు పారిశ్రామికవేత్తలతో గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొన్నాం, ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తక్కువగా ఉంది, కేవలం నాలుగేళ్లలో సమస్యలను అధిగమించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. అభివృద్ధి, సంతోష సూచికలోనూ అందరికంటే ముందు ఉండాలన్నదే లక్ష్యం.
రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తున్నాం, ఇంటర్నెట్ ప్రజలకు ప్రాధమిక హక్కుగా మారింది. తొలుత ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు, ఇప్పడు ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నాం. ఫైబర్ గ్రిడ్ ద్వారా రూ.149లకే ఇంటర్నెట్, వైఫై, టెలివిజన్ సేవలు అందిస్తున్నాం. విశాఖ ఐటి హబ్‌గా, రాయలసీమ జిల్లాలు తయారీ రంగానికి హబ్‌గా మారుతున్నాయన్నారు. అనంతపురంలో ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల కంపెనీ కియో వస్తున్నాయి. ఫాక్స్‌కాన్, సెల్‌కాన్, డిక్సన్, కార్బన్ లాంటి ఎలక్ట్రానిక్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో కార్యక్రమాలు ప్రారంభించాయి, టిసీఎల్, రిలయన్స్, జియో, ఫ్లెక్స్ ట్రానిక్స్ లాంటి కంపెనీలు త్వరలోనే ప్రారంభించబోతున్నాయి. కంపెనీలకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని అనుమతులు 21రోజుల్లోనే కల్పిస్తున్నామన్నారు.