పవన్ కు పవర్‌ కోసం…

విజయవాడ, డిసెంబరు30: తమిళ రాజకీయాల్లో కనిపించే దృశ్యాలు అంధ్రప్రదేశ్‌లో కూడా ప్రారంభమయ్యాయి. తమ ప్రియతమ నేత అధికారంలోకి రావాలంటూ మొక్కులు మొక్కడం, పూజలు చేయడం ఇక్కడ కూడా ఉంది కానీ తమిళనాడులో మరీ ఎక్కువ. ఆ అభిమానమే వేరు. అక్కడ సినిమాకూ రాజకీయాలకూ మధ్య పెద్ద తేడా ఉండదు. ఎపి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా అలాంటి అభిమానులే అధికంగా ఉన్నారు.
రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించి సీఎం సీటును అధిష్టించాలని ఆకాంక్షిస్తూ పార్టీనేతలు విజయవాడ కనక దుర్గ ఆలయం చుట్టూ ‘ గిరిప్రదక్షిణ ’ చేపట్టారు. ఆదివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సభ్యుడు బొలిశెట్టి వంశీకృష్ణ ఆధ్యర్యంలో ఘాట్‌రోడ్‌లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ‘గిరి ప్రది‌క్షిణ’ చేపట్టారు. అవినీతిలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని గద్దె దించి పవన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ప్రద‌క్షణ చేపట్టినట్లు జనసేన నేతలు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా జగన్ పాదయాత్రల పేరుతో కాలయాపనచేస్తున్నారనీ, రాష్ర్టాన్ని అభివ‌ృద్ధి చేసే శక్తి ఒక్క పవన్ కళ్యాణ్‌కు మాత్రమే ఉందన్నారు.