‘బేడి’కి యానాంలో నిరసన సెగ

                                                                                                                                                (న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగమైన యానాంలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ రెండు రోజుల పర్యటనపై స్థానికంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కిరణ్ బేడీ అడ్డుపడుతున్నారని పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆరోపిస్తూ నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో కిరణ్ బేడీ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. బందోబస్తు కోసం తమిళనాడుతో పాటు ఏపి సాయం కూడా కోరారు. ఇప్పటికే ఏపి ప్రభుత్వం విశాఖ నుండి 200 మంది పోలీసులను అక్కడికి పంపింది.

ఈ రోజు పుదుచ్చేరి నుండి కిరణ్ బేడీ యానాంకు చేరుకోనున్నారు. రేపు, ఎల్లుండి అక్కడే బస చేసి బుధవారం మధ్యాహ్నం తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు. ఈ రెండు రోజుల్లో కిరణ్ బేడి యానాంలోని పలు ప్రాంతాల్లో తిరిగి క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకోనున్నారు. యానాం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండటంతో నారాయణ స్వామి ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, లెప్టినెంట్ గవర్నర్ కిరణ్‌ బేడీల మద్య అధికారాల విషయంలో తలెత్తిన వివాదం సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన విషయం తెలిసిందే.