విస్తృత ధర్మాసనానికి శబరిమల కేసు!

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పునసమీక్ష కోరుతూ దాఖలయిన పిటిషన్లను అయిదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించింది. అయితే శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే ఉత్తర్వులూ జారీ చేయలేదు. అంటే మహిళల ప్రవేశం యధావిధిగానే కొనసాగుతుంది.

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి బహిష్టు వయసు మహిళలు ప్రవేశించడంపై చాలాకాలంగా ఉన్న సంప్రదాయబద్ధ నిషేధాన్ని గత సంవత్సరం సెప్టెంబర్ 28న అయిదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజారిటీతో రద్దు చేసింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ ధర్మాసనానికి నేతృత్వం వహించారు.

ఈ తీర్పు కేరళలో తీవ్రమైన నిరసనలకు దారి తీసింది. అగ్రకుల సంఘాలు, ఆరెస్సెస్ వంటి హిందూత్వ సంస్థలూ ఆలయంలోకి మహిళల ప్రవేశంపై రోడ్లపైకి వచ్చాయి. తీర్పును బిజెపి స్వాగతించగా ఆ పార్టీ కేరళ శాఖ నిరసించింది.

ఈ తీర్పు సమీక్షను కోరుతూ దాఖలయిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి నివేదించాలని 3:2 మెజారిటీతో ధర్మాసనం నిర్ణయించింది. జస్టిస్ ఆర్ ఎఫ్  నారిమన్, జస్టిస్ డివై చంద్రచూడ్ మెజారిటీ నిర్ణయంతో విభేదించారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సేన అవసరమే లేదని ఆ ఇద్దరు న్యాయమూర్తులూ తమ తీర్పులో పేర్కొన్నారు.

జస్టిస్ ఎఎమ్ కన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రా ప్రధాన న్యాయమూర్తి నిర్ణయంతో ఏకీభవించారు. కోర్టులో మెజారిటీ తీర్పు చదివిన చీఫ్ జస్టిస్, శబరిమలే కాకుండా ఇలాంటి వివాదాలు ఇంకా ఉన్నాయని అన్నారు. ఇస్లాంలో మసీదుల్లోకి మహిళలను వెళ్లనివ్వరనీ, పార్సీ మతస్తుల్లో కూడా ఇలాంటి ఆంక్షలు ఉన్నాయనీ ఆయన అన్నారు. దావూదీ బోహ్రా మతస్తుల్లో యువతుల మర్మాంగాన్ని ఛిద్రం చేస్తారని పేర్కొన్నారు.  ఈ తరహా వివాదాలన్నిటినీ ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.