రాజకీయ స్వామిగా స్వరూపానందేంద్ర!


అమరావతి, డిసెంబరు 23 : దేశ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు స్వామీజీల అండదండలుతీసుకోవడం ఒక రాజకీయ ఆనవాయితీగా మరింది.  ఒక వర్గం ప్రజలను దగ్గర చేసుకునేందుకు సులువైన మార్గంగా ఆధ్యాత్మిక గురువుల, స్వామీజీల ఆశీస్సులు అందుకోవడంలో దేశంలోని అన్నిరాజకీయపార్టీల నేతలు తాపత్రయపడుతుంటారు. తాజాగా తెలంగాణా ఎన్నికలకు ముందు విజయం సాధించేందుకు సీఎం కేసిఆర్ చేసిన రాజ శ్యామల యాగం ఆయన గెలుపు తర్వాత చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక విశాఖకు చెందిన శారధాపీఠాధిపతి స్వరూపానందేంద్ర  సరస్వతి స్వామీజీ వున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా కేసిఆర్ విశాఖకు వచ్చి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు.

వైఎస్ జగన్‌ కూడా …

గత ఎన్నికల ఫలితాల నేపధ్యంలో హిందూ ఓటు బ్యాంకును దగ్గర చేసుకునేందుకు మన రాష్ట్రంలోని స్వామీజీలు చిన్న జీయర్, విశాఖ స్వరూపానందేద్రల ఆశీస్సులను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీసుకున్నారు. అంతేకాకుండా మరింత ముందుకు వెళ్ళి గతంలో స్వరూపానందేంద్రతో కలసి రుషికేష్‌లో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో స్వరూపానందేంద్ర వైసీపీ స్వామీజీగా ముద్రపడ్డారు. అంతేకాదు, టీడీపీ ప్రభుత్వానికి ఆయన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం అందుకు మరింత బలాన్ని చేకూర్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారపార్టీలతో సన్నిహితంగా మెలిగి ఇతర స్వామీజీలకన్నా ముందుండాలన్న తలంపు స్వరూపానందేంద్రలో ఎప్పుడూ కనిపిస్తూనే వుంటుంది.