హర్యానాలో బీజేపీకి ఇండిపెండెంట్ల మద్దతు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. 40 సీట్లను గెల్చుకున్న బీజేపీకి అధికారాన్ని చేపట్టేందుకు మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే, ఇండిపెండెంట్లుగా గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. వీరి మద్దతుతో బీజేపీ సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్ 46 కంటే ఒకటి ఎక్కువగానే ఉండబోతోంది. స్వతంత్ర ఎమ్మెల్యేలు ధరంపాల్ గండన్, నయన్ పాల్ రావత్, సంబీర్ సంగ్వాన్.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిసి తమ మద్దతు తెలిపినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇండిపెండెంట్లు గోపాల్ ఖండా, రణధీర్ గోలన్, బల్రాజ్ కుందూ, రంజిత్ సింగ్, రాకేశ్ దౌలతాబాద్ లు బీజేపీకి ఎలాంటి షరతులు లేకుండా మద్దతిస్తున్నామని ప్రకటించారు.

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా..ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరం. 40 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ఇంకా ఆరు సీట్లు కావాలి. అయితే, హర్యానాలో ఎనిమిది మంది స్వతంత్రులు గెలిచారు. వీరంతా బీజేపీకి మద్దతిస్తే.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. దీంతో హర్యానాలో నెలకొన్న పొలిటికల్ టెన్షన్ కు తెర పడింది. కావాల్సినంత మెజార్టీ లభించడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు లాంఛనంగా మారింది.మనోహన్ లాల్ ఖట్టర్ మరోసారి సీఎంగా చేయనున్నారని తెలుస్తోంది.