Breaking: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాకు కన్నా రాజీనామా లేఖ పంపారు. అనుచరులతో కలిసి బీజేపీకి కన్నా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. గుంటూరులోని తన నివాసంలో ఈ ఉదయం ముఖ్య అనుచరులతో సమావేశమైయ్యారు. ముఖ్య అనుచరులతో నిర్వహించిన సమావేశంలో బీజేపీని వీడాలని నిర్ణయించుకున్న అనంతరం మీడియా ముందు రాజీనామా ప్రకటన చేశారు. ఈ సందర్బంలో రాష్ట్ర బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర నాయకత్వం తీరు నచ్చక రాజీమానా చేసినట్లు వెల్లడించిన కన్నా లక్ష్మీనారాయణ..జెపి నడ్డాకు పంపిన తన రాజీనామా లేఖలో మాత్రం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సోము వీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని అన్నారు. తనతో పాటు రాజీనామా చేసిన అనుచరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే ఏ పార్టీలో చేరతారు అనే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తన భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని తెలిపారు కన్నా. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పని చేసిన తాను అయిదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. ఏనాడు పదవుల కోసం తాను పాకులాడలేదనీ, పని చేస్తుంటే పదవులు అవే వచ్చాయన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తాను మోడీ నాయకత్వానికి ఆకర్షితుడనై 2014 లో అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరానని తెలిపారు. 2018లో పార్టీ అధ్యక్షుడుగా నియమితులైన తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేశాననీ, వివిధ రాజకీయ పార్టీల నుండి అనేక మంది బీజేపీలో తన ద్వారా చేరారని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేసినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. 2019 ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికలో కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో మోడీ మరల అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే తాను, తన వర్గీయులు బీజేపీలో పని చేశామన్నారు. మోడీ నాయకత్వంపై ఇప్పటికీ నమ్మకం ఉందని అన్నారు. తాను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సమయంలో పార్టీని ఏకతాటిపై నడిపాననీ, కానీ సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత పరిస్థితి అంతా మారిపోయిందన్నారు. సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్లడం లేదని అన్నారు. కక్షసాధింపుతో సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారనీ అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.