Road Accident: రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. వాహనదారులు నిర్లక్ష్యం, అశ్రద్ద కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై యర్రగొండపాలెంలో ఓ నిశ్చితార్ధానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అంభాపురానికి చెందిన వినోద్, నాని, వీరేంద్ర గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరో పక్క పల్నాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుతురు మృతి చెందారు. పిడుగురాళ్ల మండలంలోని శ్రీనివాస నగర్ వద్ద అయ్యప్పనగర్ కు చెందిన యనమల నరసింహరావు (40), ఆయన కూతురు శ్రీనిధి (15) లు పుస్తకాల కొనుగోలు కోసం బ్రాహ్మణపల్లి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కూరుతు ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే జిల్లాలో పాత నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోగ నాగేశ్వరరావు (46) అదే గ్రామానికి చెందిన నాదెండ్ల మోహన్ రావు తో కలిసి ద్విచక్ర వాహనంపై వ్యవసాయ మోటారు మరమ్మత్తులు కోసం వినుకొండ వెళుతుండగా, ఎర్రగొండపాలెం వైపు వెళ్తున్న వినుకొండ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, నాదెండ్ల మోహన్ రావు తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ లో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయన పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాధమిక చికిత్స అనంతరం నరసరావుపేట కు తరలించారు. ఇక గుంటూరు జిల్లాలో జరిగిన ఓ యువకుడు మృతి చెందారు. మేడికొండూరు గ్రామానికి చెందిన గుండాల సామి ఏసు (24) ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుంటూరు వైపు వెళ్తున్న లారీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సామి ఏసు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.