NewsOrbit
బిగ్ స్టోరీ

కూలుతున్న విలువల కోట

రోజు మారేకొద్దీ భారత దేశం మారిపోతున్నది. ఈ మార్పు మనకి వీధులలో, పని చేసే చోట, కుటుంబ సంభాషణలలో, పార్లమెంట్‌లో, ఇంటర్నెట్‌లో, మీడియాలో ఎక్కడ పడితే అక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. కొత్తగా అమిత బలశాలి దేశంగా భారత్‌ను చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. మనలో కొంత మందిమి దీనిని చావు భయంతో చూస్తుండగా, మరి కొంతమంది దీనిని ఉత్తేజిత విజయగర్వంతో గమనిస్తున్నారు.

భారత దేశ స్వాతంత్ర పోరాటానికి జవసత్వాలు అందచేసిన విలువల ఆధారంగా, ఈ దేశ రాజ్యాంగ వాగ్దానాల – అవి ఎంత అసంపూర్ణంగా మిగిలిపోయినా సరే- ఆధారంగా ఊహించుకున్న దేశం మన కళ్ళ ముందే చాల వేగంగా కుప్పకూలిపోతున్నది. ఇటువంటి భారతదేశానికి మద్దతుగా నిలబడటానికి ఇష్టపడుతున్న వారు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎటువంటి దయ, విలువలు లేని ప్రజానీకంగా మనం చాలా వేగంగా తయారవుతున్నాము.

మే,2019లో తాము సాధించిన ఘన విజయాన్ని భారతదేశాన్ని ఒక అధిక సంఖ్యాక వర్గం ఆధిపత్యం చెలాయించే దేశంగా, నియంతృత్వ దేశంగా, సైనికతత్వ దేశంగా, విలువల రహిత హిందూ దేశంగా మార్చటానికి అందిన ఒక అవకాశంగా మోడీ-షా భావిస్తున్నారు అనేది సుస్పష్టం. మోదీ పాలన మొదటి దఫాలోనే ఈ ప్రాజెక్ట్ చాలా ముందంజ వేసింది. అయితే అప్పట్లో భారత రాజ్యాంగం పెట్టిన పరిమితుల గురించి కనీసం ఒక లాంఛనమైన ఒప్పుదల అయినా ఉండేది. అందుకనే అప్పుడు అంతర్గతంగా లోపల నుంచి తొలచడం ద్వారా,  ప్రజాస్వామ్య సంస్థలనూ, సంప్రదాయాలనూ క్రమంగా బలహీనపరచడం ద్వారా, ఎప్పటికప్పుడు భయం, ద్వేషంతో కూడిన వాతావరణాన్ని నిర్మించడం ద్వారా రాజ్యాంగాన్ని రహస్యంగా ధ్వంసం చేసుకుంటూ వచ్చారు.

అయితే మే నెలలో లభించిన ఘన విజయంతో మోడీ-షా ద్వయం ఇటువంటి మిషలకూ, నటనకూ స్వస్తి పలికారు. నేటి రాజకీయ పాలకుల ఊహల్లోని భారతదేశంలో ఈ జాతి ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రధానమైన శత్రువులు భారత రాజ్యాంగం నైతిక ఉన్నతి; ఈ దేశంలోని ముస్లిం, క్రైస్తవ అల్పసంఖ్యాక వర్గాలు; వామపక్ష, ఉదారవాద అసమ్మతివాదులు. ఈ ముగ్గురి మీద ఇప్పుడు బహిరంగ యుద్ధమే ప్రకటించారు. దానికి మనమందరం సాక్షులమే.

మోదీ రెండవ పాలనా కాలం ఎలా ఉండబోతుందో మనకి ముందుగానే సంకేతాలు అందాయి. ‘జై శ్రీ రాం’ నినాదం పార్లమెంట్ నుండి వీధులలోకి వేగంగా వ్యాప్తి చెందింది. ఈ నినాదం ఇప్పుడు మూక హత్యల నినాదం అయ్యింది. ఇంతకముందు లాగా పవిత్రమైన ఆవుని కాపాడటానికి హత్య చేస్తున్నాము అనే నెపాన్ని కూడా పూర్తిగా వదిలేసారు.

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్‌ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని, ‘చొరబాటుదారులు’ దేశంలో ఏ మూల ఉన్నా తరిమేస్తామని అమిత్ షా పార్లమెంట్ లో గర్జించారు. ఇదేదో తిన్నది అరక్క చేసిన బెదిరింపు అనుకుంటే పొరపాటే. అందులోనూ మోదీ-షా ద్వయం ఉత్తుత్తి బెదిరింపులు చేస్తారు అనుకోవటం. పగ్గాలు చేపట్టిన మొదటి రోజే భారతదేశంలో అన్ని ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వాలకి, జిల్లా కలెక్టర్లకి ఫారినర్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చెయ్యటానికి అధికారాలు ఇస్తూ షా నిర్ణయం తీసుకున్నారు. విదేశీయులుగా నిర్దారించిన వారి నిర్బంధానికి డిటెన్షన్ కేంద్రాలు ఏర్పాటు చెయ్యమని అన్ని రాష్ట్రాలనూ ఆదేశించారు.

ఈ ప్రభుత్వం భాషలో ‘చొరబాటుదారులు’ అంటే సరైన పత్రాలు లేని ముస్లింలే. ఎందుకంటే సరైన పత్రాలు లేకుండా వలస వచ్చినవారు హిందువులో, ఇంకేదైనా మతానికి చెందినవారో అయితే వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో శరణార్ధులు. అలాంటి వారికి పౌరసత్వం ఇవ్వట కోసం పౌరసత్వ చట్టాన్ని సవరిస్తామని బిజెపి తన మానిఫెస్టోలో మాట ఇచ్చింది.

ఈ చర్య భారతదేశ లౌకిక, ప్రజాస్వామిక రాజ్యాంగం మీద కోలుకోలేని దెబ్బ అవుతుంది. పద్దెనిమిది కోట్ల మంది ముస్లింలు – పోనీ వారిలో ఒక భాగమే అనుకోండి – 1950 నుండి తాము ఈ దేశ పౌరులమే అని నిరూపించుకోవటానికి కావలసిన పత్రాలు సమర్పించాల్సి వస్తే ఆ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి.  ఏ దేశానికి చెందనివారిగా చేస్తామని అల్ప సంఖ్యాక వర్గాలని రాజ్యం బెదిరిస్తుంటే దాని కారణంగా ఆ అల్ప సంఖ్యాక వర్గాల వారు పడే బాధ ఎలా ఉంటుందో మనం అస్సాంలో చూస్తున్నాము. అటువంటి దానిని అంచెలంచెలుగా మిగతా అన్ని రాష్ట్రాలలో ప్రవేశపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో మొదలుపెడతారు కావొచ్చు. పెద్ద పెద్ద మెట్రో నగరాలలో కూడా బహుశా. ఇదేదో ఊహాజనిత భయంకర స్వప్నం కాదు. కశ్మీర్ కి సంబంధించి జరిగిన రాజ్యంగ కుట్ర తరువాత ఏదైనా సాధ్యమే.

గత రెండు దశాబ్దాలలో ఏ ఒక్క సమావేశాలలోనూ జరగని విధంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎక్కువ బిల్లులు ఆమోదం పొందాయి. ఇవి చాలా ఫలవంతమైన సమావేశాలని అంటున్నారు. అయితే కేవలం మోదీ-షా అజెండాను మరి కొన్ని అడుగులు ముందుకు నడపడంలో మాత్రమే ఈ సమావేశాలు ఫలవంతమైనవి. బడ్జెట్లో చెప్పుకోవటానికి ఏమి లేదు, ప్రేరణ కలిగించే అంశాలు ఏమి లేవు. అంతే కాక అందులో పేర్కొన్న అంకెలలో ఒకదానితో ఒకదానికి పొంతనే లేదు. అయితే తప్పుడు గణాంకాలు, పెరుగుదల ఆగిపోయిన వృద్ధి రేటు, ఉద్యోగాల కల్పన ఈ ప్రభుత్వానికి చింతే కాదు: ఎందుకంటే వారికి పెరుగుతూ వస్తున్న మద్దతు కీలకం అక్కడ లేదు, అధిక సంఖ్యాక మతస్థుల ఆధిపత్యం అజెండాని ముందుకు తీసుకువెళ్లటంలో ఉంది.

విపక్షాలు అన్నీ కలిసికట్టుగా ఉండుంటే దీనికి అడ్డుకట్టు వేసుండేవారు. అయితే వాళ్ళందరూ అమోమయంలో, ఎన్నికలలో ఓటమితో డీలా పడి, సైద్ధాంతికంగా నిస్సారంగా, అవకాశవాదులుగా, ప్రలోభాలకి లేదా బెదిరింపులకి లొంగిపోయే లాగా ఉన్నారు.

దీని కారణంగానే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ మొదటి సెషన్లో తన అజెండా బిల్లులకి ఆమోదం పొందగలిగింది. సంస్థలనే కాకుండా వ్యక్తులని కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే అవకాశం ఉండే విధంగా చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టానికి సవరణ చేశారు. వ్యక్తిగత అసమ్మతిని అణిచివేయటానికి ఇప్పటివరకు లేని విధంగా చేసిన అమానుషమైన సవరణ ఇది. దీని కారణంగా ఈ ప్రభుత్వం చర్యలను మనం సూత్రపూర్వకంగా వ్యతిరేకించిన సందర్భంలో మన మీద ఉగ్రవాదులుగా ముద్రవేసే అవకాశం ఎంతైనా ఉంది. అది అర్బన్ నక్సల్ పేరు మీద కానీ జిహాదీ పేరు మీద కానీ.

సమాచార కమిషనర్ల పదవీ కాలం, జీతభత్యాలని తమకి జవాబుదారీగా ఉండవలసిన కేంద్ర ప్రభుత్వ, దయా దాక్షిణ్యాల మీద ఆధారపడేట్లు చట్టాన్ని సవరించడం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని చాలా జాగ్రత్తగా నీరుకార్చారు.  స్థాయి సంఘానికి నివేదించకుండా, ఇతర మతాలలో భార్యలని వదిలేసినవారిని వదిలేసి కేవలం ముస్లిం భర్తలనే నేరస్థులుగా చూపించడం పట్ల వచ్చిన వ్యతిరేకతని పట్టించుకోకుండా తక్షణ ట్రిపుల్ తలాక్‌ని నేర చర్యగా పరిగణిస్తూ బిల్లు ఆమోదింపచేసుకున్నారు.

లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి బిజెపి-ఆర్ఎస్ఎస్ అజెండాని ఏ విధంగానైనా ముందుకు తీసుకువెళ్ళాలన్న మోడీ-షా సంకల్పానికి స్పష్టమైన సంకేతం కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుతో జమ్మూ కశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక హోదాని రద్దు చెయ్యటం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం. భారతదేశానికి అనుకూలంగా ఉండే రాజకీయనాయకులని అరెస్ట్ చేసి, రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలో ముంచేసి ఈ పని కానిచ్చారు మోడీ-షా ద్వయం.

ఇటువంటి ప్రమాదకరమైన, బాధ్యతారాహిత్య, అప్రజాస్వామిక, రాజ్యంగ విరుద్ధమైన పనిని పెద్ద ఎత్తున ప్రజా సంబరాలు మధ్య చెయ్యగలగడం, ఈ చర్యతో భారతదేశంతో కశ్మీర్‌కి ఉన్న చివరి బంధం కూడా తెగిపోతుంది అనే పట్టింపు లేకుండా దుందుడుకుగా ముందుకు వెళ్ళటం చూసిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఏదైనా సాధ్యమే అనేది అర్ధమవుతుంది, ఆర్ఎస్ఎస్ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లడం సాధ్యమే అని అర్ధం అవుతుంది. ఇక తమ రాజ్యం వచ్చేసిందని  ఆర్ఎస్ఎస్ భావిస్తున్నది.

ఆర్ఎస్‌ఎస్ భారత రాజ్యాంగాన్ని ఏనాడు ఒప్పుకోలేదన్న విషయన్ని, మొదట్లో భారతదేశ భిన్నత్వానికి ప్రతీక అయిన మూడు రంగుల జండాని కూడా తిరస్కరించిందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవటం అవసరం. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ఏకైక రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చెయ్యటం ఆర్ఎస్ఎస్, బిజెపి అజెండాలోని అతి ముఖ్యమైన అంశం. దీనితోపాటు మరొక ప్రాధాన్యతాంశం ఉమ్మడి పౌరస్మృతిని చట్టబద్దం చెయ్యటం. ఆ దిశగా ఈ ట్రిపుల్ తలాక్ చట్టం ఒక ముఖ్య ముందడుగు. ఇలాంటి అడుగులు మరిన్ని వస్తాయి. వీరి మూడవ లక్ష్యం బాబ్రి మసీదు కూలగొట్టిన చోట రాముడి గుడి కట్టడం. దీని గురించి కూడా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

వీటితో పాటు జాతీయ స్థాయిలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ అమలు చేయడం; ఆర్ఎస్ఎస్ భావజాలం కలవారిని పక్క దారి ద్వారా  ప్రభుత్వంలో ఉన్నత స్థాయిల్లోకి  చేర్చడం; భిన్న ఆలోచనల సంఘర్షణ కేంద్రాలుగా, ఎటువంటి భయం లేకుండా తమ అసమ్మతిని తెలిపే ప్రదేశాలుగా ఉన్న విశ్వవిద్యాలయాలని నాశనం చెయ్యటం;  విద్వేష హింసని మరింత మామూలు సంగతిగా మార్చడం అంటే ఇప్పటివరకు మనకు తెలిసిన భారతదేశానికి చరమ గీతం పాడటమే.

మోదీ మొదటి దఫాలో రాజ్యాంగం మీద, ముస్లిం, క్రైస్తవ అల్ప సంఖ్యాక వర్గాల మీద, అసమ్మతివాదుల మీద జరిగిన యుద్ధం కోవర్టు గెరిల్లా యుద్ధం. ఈ రోజు హోం మంత్రి అమిత్ షా తన పక్కనే ఉన్నాడు.. ఇప్పుడు ఇక అంతరుద్ధ్యం బహిరంగమే. శాఖలు శాఖలుగా విడిపోయి, తుడిచిపెట్టుకుపోయిన విపక్షానికి తేరుకుని, తిరిగి పోరాడటానికి మరొక్క అవకాశం ఉంది. లేదంటే భారతదేశ రాజకీయ వర్గాలని చరిత్ర క్షమించదు.

అయితే వీటన్నిటితో సంబంధం లేకుండా భారత దేశ ప్రజలు పోరాడుతూనే ఉంటారు. లేకపోతే జరిగే నష్టం అపారం. ఎక్కడయితే మనమందరం సమాన స్థాయి పౌరులుగా జీవించగలమో, ఎక్కడయితే భయం లేకుండా తల ఎత్తుకుని అందరూ నిలబడగలరో, ఎక్కడయితే సభ్యత, న్యాయం, దయ, నైతికత వర్ధిల్లుతాయో అలాంటి భారతదేశం మనగలుగుతుంది. ఒక రోజు నాటికి పై చేయి సాధించగలుగుతుంది కూడా.

హర్ష్ మందిర్

వ్యాసకర్త సామాజిక కార్యకర్త, రచయిత

ద వైర్ సౌజన్యంతో   

 

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment