బిగ్ స్టోరీ

కాలం మారినా కోటరీ మారదు…!

Share

ప్రతి పుట్టుకకు కారణం ఉంటుంది.
ప్రతి ఎదుగుదలకు కారణం ఉంటుంది.
ప్రతి తిరోగమనానికి ఒక కారణం ఉంటుంది.
తిరోగమన దశ తర్వాత ప్రతి పునః పెరుగుదలకు ఒక కారణం ఉంటుంది. అది అన్వేషించడమే కష్టం. తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అదే దశలో ఉంది. కారణాన్వేషణలో ఉంది. పుట్టుక కారణం “ఆత్మా గౌరవం”…! ఎదుగుదల కారణం “ఎన్టీఆర్” అనే క్రేజు. తిరోగమన కారణం “చంద్రబాబు” అనే స్వార్ధం. మరి పునః పెరుగుదల కారణమో…! లేదు. దొరకడం లేదు. బూతద్దం పెట్టి వెతికినా ఆచూకీ చిక్కడం లేదు. అదే అవస్థల మధ్య ఈరోజు 38 పడి లోకి అడుగిడి, నాటి నవ్వులైన, సంబరాలతో నిండిన, జెండా రెపరెపలాడిన మోములకు దూరమయ్యింది.

చరిత్ర చెత్త బుట్టలోకి…!

పార్టీ అంటే ప్రభంజనం. ఎన్టీఆర్ అంటే క్రేజు, మోజుతో పార్టీ అందలమెక్కింది. మొదటి ప్రయత్నంలోనే గద్దెనెక్కిన తర్వాత ఏడాదిన్నరలోనే మళ్ళీ ఎన్నికలు, మళ్ళీ గెలుపు. పరిపాలన అదుర్స్, పథకాలు అద్భుతం. అమోఘం. కానీ అక్కడే ఎన్టీఆర్ తేరా ముందు ఉంటె తేరా వెనుక చక్రం చంద్రబాబు చేజిక్కించుకున్నారు. అంతా బాగుండని ఎన్ఠీఆర్ అనుకున్నా…1989 నాటికీ రాజకీయం తెరలేచింది. ఎన్టీఆర్ లోని కులం నిద్ర లేచింది. అంతా ఒక్కటయ్యారు. అయినా ఐదేళ్లు ప్రతి పక్షానికి పరిమితమయ్యారు. 1994 నాటికీ పార్టీ పేరుకే ఎన్టీఆర్ ది, వెనుక కీలక నిర్ణయాలు, చక్రాలన్నీ చంద్రబాబు చేతిలోకి వెళ్లాయి. కోటరీ చేరింది. 1994 ఎన్నికల్లో చంద్రబాబు తరహా రాజకీయం జరిగింది. అక్కడే ఎన్నికల్లో నగదు పంపిణీ, మద్యం ఇవ్వడం అలవాటు అయింది. చంద్రబాబు చాణక్యతతో, ఎన్టీఆర్ ఛరిష్మాలతో, కాంగ్రెస్ స్వీయ తప్పిదాలతో మళ్ళీ టిడిపికి విజయం. బాబుకి కుర్చీ కావాల్సి వచ్చింది. 1995 అనేక పథకాలు వేయడం, వైస్రాయ్ లో నాటకీయ పరిణామాలు జరగడం, రామోజీ వంటి ఘనులు బాబు పంచన చేరడం, యనమల లాంటి వారు కన్నింగ్ ప్రయోగించడం… ఫలితంగా కుర్చీ బాబుకి చేరింది. ఎన్టీఆర్ శకం ముగిసింది. దీనిలో ఎన్టీఆర్ స్వీయ తప్పిదాలు అనేకం ఉన్నాయి, బాబు స్వార్ధం, బాబు చాణక్యం, సింపుల్ గా బాబు కన్నింగ్ చాల వర్కవుట్ అయింది. 38 ఏళ్ల టిడిపిలో 1995 వరకు ఒక తరహా, తర్వాత మరో తరహా. 2004 నాటికీ పార్టీ చరిత్ర చెత్త కాగితాల్లోకి చేరగా…, మళ్ళీ 2019 వచ్చే సరికి ఆ చెత్త కాగితాలన్నీ బుట్టలోకి వెళ్లాయి. పార్టీని పూర్తిగా చెత్త బుట్టలో వేయాల్సిన అవసరం లేదు. నాలుగు దశాబ్దాలుగా భుజాన మోస్తున్న కార్యకర్తలు అనేకం ఉన్నారు. నరనరాన పార్టీని అంటిపెట్టుకున్న, కంటిలో పెట్టుకున్న కార్యకర్తలున్నారు. కానీ కావాల్సింది దిక్సూచి.

పఠనం లేని పతనం…!

ఆత్మగౌరవం కోసం… పేద వర్గాల కోసం… పుట్టిన పార్టీలో కోటరీలు చొరబడ్డాయి. చుట్టూ నిండిన స్వార్ధమే ఎక్కువయింది. ఓ కులం కోసం పుట్టిన పార్టీగా మారింది. తొలినాళ్లలో ఎవరు, ఏ వర్గం వారు పార్టీని తమ భుజాలపై మోసారో ఆ వర్గాలు క్రమేణా దూరమయ్యాయి. పెత్తనం మారింది. 2014 లో రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మరో ప్రత్యామ్నాయం, గత్యంతరం లేక అధికారం చేజెక్కింది. కానీ మునుపటి స్వార్ధం మారలేదు. చేసింది తక్కువ, ప్రచార యావ, డాబు, దర్పం పెరిగి జనాలకు చిర్రెత్తుకొచ్చింది. సొంత వర్గాలైన కార్యకర్తలే విసిగిపోయారు. పార్టీ నడిపిస్తున్న తీరు, లోకేష్ ప్రవర్తనలతో విసుగెత్తిన నాయకులూ కూడా దూరమయ్యారు. క్రమేణా పార్టీ పతనానికి చేరింది. కానీ దీని నుండి పఠనం ఏమి చేయలేదు. బాబుకి భజనలు చేసే కోటరీ మారలేదు. ప్రచార యావ తగ్గలేదు. అదే చినబాబుకు అంటింది. మరింత ఎక్కువగానే అంటింది.

కిం కర్తవ్యమ్…!

బాబుకి వయసు దాటుతుంది. ప్రసంగంలో పస లేదు. జనంలో ప్రభావం లేదు. పార్టీ పునాదులు కూడా పగులుతున్నాయి. పార్టీ స్తంభాలు పెచ్చులు రాలుతున్నాయి. చెత్త బుట్టలో చేరిన చరిత్రని ఏరి తెచ్చి పక్కాగా పుస్తకంగా, భావి తరాల జ్ఞాపికగా మార్చాలంటే పార్టీకి చక్కని నాయకత్వం అవసరం ఉంది. కానీ ఎవరు? ఈ కీలక ప్రశ్నకు సమాధానం కరువయ్యింది. లోకేష్ కి రాజకీయ జ్ఞానం లేదు. కలుపుకునే తత్వం లేదు. తక్కువ వయసులోనే బోలెడన్ని ఆరోపణలు, పరిపక్వత లేదని పార్టీలోనే వాదనలు. బ్రాహ్మిణి అని, చిన్న ఎన్ఠీఆర్ అని ఏవేవో పేర్లు తెరపైకి వస్తున్నా ఏ ఒక్కరికీ ఆ సత్త లేదు. కష్టమో, నష్టమో… తప్పో, ఒప్పో బాబు చేసిన రాజకీయం, బాబు మోసిన పార్టీ సిద్ధాంతం మళ్ళీ ఎవరూ నెత్తిపై ఎత్తుకుని మోయలేరు. మోసేందుకు సిద్ధంగా లేరు. తెలంగాణ నాట కేసీఆర్ కి ప్రత్యామ్నాయం కేటీఆర్ ఉన్నారు. తండ్రికి మించిన చరిష్మా సంపాదించుకున్నారు. ఆయనకు తోడు హరీష్ రావు, అక్కడికీ కాదంటే కవిత ఇలా…. పార్టీ భుజాన మోసే వారు బోలెడు ఉన్నారు. కానీ టిడిపిలోనే ప్రత్యామ్నాయం లేదు. రాదు. బాబు కనీసం ఆ ప్రయత్నాలు కూడా చేయడం లేదు. బాబు బుర్రం మొత్తం పుత్రోత్సాహం నిండి, కొడుకుకి పగ్గాలు ఇవ్వడం పైనే ఉంది. కొన్నేళ్లలో ఇది తప్పదు. కానీ దీని వ్యతిరేకించేవారు, తిరుగుబాటుదారులు పెరిగి పార్టీకి పునాదులు భీకటిల్లే ప్రమాదం ఉంది. బాబే ఆలోచించాలి. తన బాబు కాకుండా ఇంకెవరు అనే కోణం లో దారి చూడాలి, చూపాలి.


Share

Related posts

Tirupati by poll : తిరుపతి ఓటరు ఎటు..? టఫ్ ఫైట్ తప్పేట్టు లేదు..!!

Muraliak

YS jagan: అహం ప్రజాధనం బ్రహ్మశ్మి!

Comrade CHE

గణేశ్ మండపాల ఏర్పాటు… ప్రభుత్వానికి బీజేపీ కౌంటర్

DEVELOPING STORY

Leave a Comment