Pushpa 2: ప్రస్తుతం తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో పుష్ప 2: ది రూల్ ఒకటి. ఈ యాక్షన్ డ్రామాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ఇందులో విలన్ గా చేస్తుంటే.. జగదీష్ ప్రతాప్ బండారి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, ధనంజయ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాతమవుతున్న ఈ చిత్రానికి ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తుండగా..నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
2021లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప: ది రైజ్ చిత్రానికి రెండో భాగంగా పుష్ప 2ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల బయటకు వచ్చిన పుష్ప 2 టీజర్ ఆ అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లింది. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ ను రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ను తిరుపతి గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్లో కట్ చేశారు. ఇందులో అమ్మవారి గెటప్‌లో మాస్ అవతారంతో అల్లు అర్జున్ తన విశ్వరూపం చూపించాడు.
అయితే ఈ జాతర ఎపిసోడ్ మొత్తం సినిమాకే హైలెట్ గా ఉంటుందట. జాతర సీన్ లో ఓ సాంగ్ తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని అంటున్నారు. అంతేకాదు ఈ జాతర సీన్ కోసం నిర్మాతలు పెట్టిన బడ్జెట్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు. ఎందుకంటే, ఆరు నిమిషాలు పాటు సాగే జాతర సీన్ కోసం చిత్రబృందం ఏకంగా రూ. 60 కోట్లు ఖర్చు చేశారట. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా సెట్ వేసి మరీ జాతర ఎపిసోడ్‌ను దాదాపు 30 రోజుల పాటు సుకుమార్ చిత్రీకరించారు.
ఈ విషయం తెలిసి సినీ ప్రియులు, నెటిజన్లు షాకైపోతున్నారు. పుష్ప 2లో ఒక్క జాతర సీన్ కి పెట్టిన బడ్జెట్ తో ఐదు చిన్న సినిమాలు తీసేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. పుష్ప ది రైజ్ లో హీరో ఎర్రచందనం కూలీ నుంచి స్మగ్లింగ్ సిండికేట్ కు నాయకుడిగా ఎలా ఎదిగాడు..? అన్న దాన్ని చూపించారు. ఇప్పుడు రెండో భాగమైన పుష్ప ది రూల్ మూవీ సిండికేట్ నాయకుడు అయ్యాక హీరో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు..? శత్రువుల వ్యూహాలను ఏ విధంగా తిప్పికొట్టాడు..? అన్న కథతో సాగుతుంది. పుష్ప 2 షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఆగస్టు 15న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీని రీసెంట్ గానే ప్రకటించారు.