ఉసిరి తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

ఉసిరికాయలు చూడటానికి చిన్నవిగా, రుచికి వగరుగా అనిపించినా అందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు ఉసిరి కాయలు తినడం వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో ఉసిరి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఉసిరిని పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో మంచి ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఉసిరిలో ఎన్నో ఔషధాలు దాగి ఉండటం వల్ల దీనిని ఔషధ రత్నమని భావిస్తారు. అయితే ఉసిరిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజు ఉసిరిని తీసుకోవటం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా దగ్గు, అల్సర్ల నుంచి పూర్తి విముక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఉసిరిలో రోగ నిరోధకశక్తిని పెంపొందించే గుణాలు అధికంగా ఉన్నాయి. కాలేయం, ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించి నటువంటి సమస్యలకు ఉసిరి ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.

ప్రతిరోజు ఉదయం ఒక టేబుల్ టీ స్పూన్ ఉసిరిరసం తీసుకొని,అందులో తేనె కలుపుకొని తాగడం ద్వారా కళ్ళకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా ఉసిరిలో అధిక శాతం ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి, మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. ఆస్తమా, శ్వాసకోశకు సంబంధించి నటువంటి వ్యాధులతో బాధపడేవారు ఎండిపోయిన ఉసిరి కాయల నుంచి తయారు చేసిన పొడికి కొద్దిగా బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా మహిళలు ప్రతిరోజు ఒక గ్లాస్ ఉసిరి జ్యూస్ తీసుకోవడం వల్ల నెలసరిలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ప్రతి రోజూ ఉసిరి తీసుకోవడం ద్వారా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.