ఆహారం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా? శరీరాన్నీ, మెదడునూ ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్ధాలు అని క్లెయిము చేసేవాటికి మార్కెట్లో కొదవ లేదు. పౌష్టికాహారం అన్నది చాలా పెద్ద వ్యాపారం. బడాబడా కంపెనీలు ఇందులో ఉన్నాయి కాబట్టి బుర్రపై ప్రభావం చూపే ఆహారాలకు ప్రాధాన్యత పెరగడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఆహారం మనిషి మూడ్ను మారుస్తుందని మనందరికీ తెలుసు. మనసు ఆరోగ్యంపై ప్రభావం చూపే అన్నవాహిక బాక్టీరియా, హార్మోన్లు, న్యూరోపెప్టైడ్లు, న్యూరోట్రాన్స్మిటర్లు వంటి వాటికీ ఆహారానికీ మధ్య లింకు ఉందని కూడా తెలుసు. అయితే ఫలనా ఆహారం ఫలానా ప్రభావం చూపిస్తుందని తేల్చడం మాత్రం కష్టం.
ఈ అంశంపై తాజాగా ఒక శాస్త్రవేత్తల బృందం అధ్యయనం నిర్వహించింది. దాని ఫలితాలను యూరోపియన్ న్యూరో సైకోఫార్మకాలజీ అనే జర్నల్లో ప్రచురించారు. మంచి ఆహారం తీసుకోకపోవడానికీ, ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక మార్పులకూ మధ్య లింకు ఉన్నట్లు ఆధ్యయనంలో తేలింది. శాకాహారం, ఆలివ్ ఆయిల్, చేపలు, కోడిమాంసం, బీన్స్, ధాన్యంతో కూడిన ఆహరాన్ని మెడిటరేనియన్ డైట్ అంటారు. ఈ మెడిటరేనియన్ డైట్ మానసిక ఆరోగ్యానికి దారి తీస్తుందని అధ్యయనంలో తేలింది.
కొన్ని రకాల వైకల్యాలు ఉన్న వారిలో ఆహారం మార్పులతో కొన్ని ఫలితాలు సాధించవచ్చని కూడా అధ్యయనం చెబుతోంది. ఉదాహరణకు ఫిట్స్ వచ్చే వారు కొవ్వు పదార్ధాలు ఎక్కువ, పిండి పదార్ధాలు తక్కువ ఉండే కీటోజెనిక్ డైట్ తీసుకున్నపుడు ఫిట్స్ రావడం కాస్త తగ్గింది. విటమిన్ బి 12 లోపం ఉన్నవారు బద్ధకం, అలసట, జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలతో బాధ పడతారు. అలాంటివారికి విటమిన్ బి12 ఇస్తే ఫలితాలు కనబడతాయి.
కానీ ఈ ఫలితాలు ఖచ్చితమైనవిగా చెప్పలేమని అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తలే అంటున్నారు. మానసిక ఆరోగ్యంపై ఆహారం ప్రభావం ఉంటుందన్నది ఖాయం. అయితే ఫలానా ఆహారం వల్ల ఇలాంటి ఫలితం ఉంటుందని ఖాయంగా చెప్పేందుకు ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాలు సరిపోవు అని వారు అంటున్నారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.