పసుపు చాలా రకాలుగా మంచిదన్న సంగతి ఆయుర్వేదం చెబుతూనే ఉంది. పసుపులో కాన్సర్ వ్యతిరేక గుణాలు ఉన్నాయన్నది పరిశోధనలో రుజువైన విషయం. ఇప్పుడు పసుపు చేయగల మరో మేలు ఉందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.
సూపర్ బగ్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా. యాంటీబయాటిక్స్‌కు లొంగని బాక్టీరియాను సూపర్ బగ్ అంటారు. మందులకు లొంగని బాక్టీరియాల వల్లనే 2050 నాటికి అత్యధికంగా మరణాలు సంభవిస్తాయని కొందరు నిపుణులు అంటున్నారు. మందులు విచక్షణా రహితంగా వాడినందువల్ల కాలక్రమేణా బాక్టీరియా ఆ మందులకు లొంగని లక్షణాల్ని సంతరించుకుంటాయి. ఈ డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియాకు పసుపుతో చెక్ పెట్టవచ్చని పరిశోధకులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హెలికోబాక్టర్ పైలోరి (హెచ్ పైలోరి) అనే బాక్టీరియాకూడా డ్రగ్ రెసిస్టెన్స్ పెంచుకున్నది. జీర్ణాశయంలో ఉండే ఈ బాక్టీరియా వల్ల జీర్ణాశయం గోడలలో పుళ్లు ఏర్పడతాయి. ఇది జీర్ణాశయం కాన్సర్‌కు కూడా దారి తీయవచ్చు. ఈ బాక్టీరియా జీర్ణాశయం గోడలపై ఉండే పొర వెనక దాక్కుంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్ధంతో నింపిన నానో కాప్స్యూల్స్ను ప్రయోగించినపుడు ఆ బాక్టీరియా గోడల వెనకనుండి బయటకు వచ్చి యాంటీబయాటిక్స్‌కు లొంగిపోయాయి.
ఇంగ్లండ్‌లోని లీడ్స్ యూనివర్సిటీ, జర్మనీలోని మరో రెండు యూనివర్సిటీల పరిశోధకులు ప్రయోగశాలలో ఈ ప్రయోగఫలితాలు సాధించారు. ఎసిఎస్ ఎప్లయిడ్ బయోమెటీరియల్స్ అనే జర్నల్‌లో ఈ ఫలితాలను ప్రచురించారు. తాము ప్రయోగించిన ప్రక్రియకు పేటెంట్ కోసం కూడా ఈ పరిశోధకులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దారిలో ఇతర డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియాను కూడా లొంగదీసే పరిశోధనలు జరుగుతాయని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.