ఇందుమూలంగా సమస్త మిత్రమండలికి తెలియజేయడమేమనగా మీరు ఏలిన వారి అనుమతి తీసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి. మీరు ఏం తింటున్నారో..ఏం కొంటున్నారో..ఏం కట్టుకుంటున్నారో..ఇంట్లో ఏం పెట్టుకుంటున్నారో..ఇలా అనేకానేక విషయాలలో మీరు ప్రభువుల అంగీకార పత్రాన్ని మెడలో వేసుకుని అడుగు ముందుకు వేయాల్సి వుంది. ఉదయాస్తమయాలు..దివారాత్రాలు..ఆరు రుతువులు..అన్ని కాలాలలోనూ అన్ని సమయాలలోనూ అన్ని సందర్భాలలోనూ ఏలికల కనుసన్నలలో మెలుగుతూ మసలుతూ వుండాలని మనవి చేసుకుంటున్నా. అన్నింటినీ మించి మీరేం చదువుతున్నారో..ఏ పుస్తకాలు మీ ఇంట్లో ఉన్నాయో పరిశీలించుకోవాల్సిందిగా నా సలహా.
ఇదంతా ఎందుకో అర్థం కావాలంటే మొన్న ముంబై హైకోర్టు న్యాయమూర్తి గారి అమూల్యమైన ప్రశ్న గురించి తెలుసుకోవాలి. భీమాకోరెగాం కేసులో అరెస్టయిన వెర్నెన్ గోంజాల్వేజ్ బెయిల్ పిటిషన్ మీద వాదనలు విని న్యాయమూర్తి వారు అడిగిన అద్భుతమైన ప్రశ్న ఇది. మీ ఇంట్లో అభ్యంతరకరమైన పుస్తకాలు దొరికాయి. వాటిలో వార్ అండ్ పీస్ నవల ఒకటి. అదెందుకు మీ ఇంట్లో వుంది? అన్నది జడ్జిగారి సూటి ప్రశ్న. ఎక్కడో ఎప్పుడో రష్యాలో జరిగిన యుద్ధం గురించి రాసిన పుస్తకం మీరెందుకు ఇంట్లో పెట్టుకున్నారు? యుద్ధం గురించి అంటే రాజ్యానికి వ్యతిరేకమైనదే కదా అని ధర్మప్రభువులు గర్జించారు.
ప్రపంచ సాహిత్యంలోనే అతి గొప్ప నవలలో ఒకటిగా ఇప్పటికీ లెక్కల్లో నిలిచే పుస్తకం వార్ అండ్ పీస్. లియో టాల్స్టాయ్ 35 సంవత్సరాల వయసులో ఆరు సంవత్సరాలు కష్టపడి రాశాడు. నెపోలియన్ రష్యా మీద దాడి చేసిన నాటి యుద్ధ సందర్భాన్ని మూల వస్తువుగా తీసుకుని మానవ సంబంధాలు..రాగద్వేషాలు..కష్టసుఖాలు..చరిత్ర..జీవన సమరం మొదలైన సమస్త విషయాల సమాహారంగా వేయి పేజీలకు పైగా రాసిన బృహత్కథ ఇది. ఆనాటి రాజరిక కుటుంటాలలోని అనుబంధాలు..వారి ప్రేమలు..ఆ బంధాల ఆడంబరాల డొల్లతనం వర్ణించడానికి ఒక చారిత్రక ఇతివృత్తాన్ని నేపథ్యంగా తీసుకున్నాడు. ఇది దాదాపు అయిదు వందలకు పైగా పాత్రలున్న మహోన్నత నవల. ప్రతి పాత్రకూ ఒక స్పష్టమైన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తూ నవల నడిపించడంలో టాల్స్టాయ్ చూపించిన అనన్యసామాన్యమైన చాతుర్యానికి నైపుణ్యానికి ప్రపంచం జేజేలు పలికింది. టాల్స్టాయ్ అంటే రష్యా ఆత్మగా రష్యన్లు భావిస్తారు. టాల్స్టాయ్ అంటే యావత్ ప్రపంచ సాహిత్యనికే ఆత్మగా అక్షర ప్రేమికులు అభవర్ణిస్తారు. ఆ నవలను ప్రపంచంలోని అన్ని భాషల్లోకీ అనువదించారు. మహాత్మా గాంధీకి టాల్స్టాయ్ అంటే అపారమైన గౌరవం.
మరి ఆ నవల మీ ఇంట్లో ఎందుకుంది? అని ఇప్పుడు ప్రశ్న వస్తే ఎవరైనా ఏం చెప్తారు? పాపం గోంజాల్వేజ్ మౌనంగానే వుండివుంటారు. మనసులోనే టాల్స్టాయ్ని క్షమాపణలు కోరి వుంటారు. అంతకు మించి ఇప్పుడు ఎవరైనా ఏం చేయగలరు?
అందుకే నా ప్రియాతిప్రియమైన స్నేహితులారా
అభ్యంతరకరమైన పుస్తకాలుంటే కాస్త వాటిని తొలగించండి
ఆ పుస్తకాలు చదివిన జ్ఞానంతో కూడిన ఆలోచనలుంటే కాస్త వాటిని కాల్చి బూడిద చేయండి
బుక్ షెల్ఫ్ లు బూజు దులిపి బూతు పుస్తకాలేమైనా వుంటే వాటిని అందంగా అలంకరించండి
శతకోటి నామాలున్న దేవదేవుని సంకీర్తనల పుస్తక సంచయాలేమైనా వుంటే వాటితో ఇల్లంతా నింపండి
ఎప్పుడైనా సోదా జరగొచ్చు చిడతలు పట్టుకుని సిద్ధంగా వుండండి
బుర్రకున్న కిటికీలన్నీ మూసేసి చెక్కభజనలో బుర్రను పావనం చేసుకోండి
ఓ నా ప్రియదోస్తులారా జాగ్రత్త.. అభ్యంతరం..అభ్యంతరం..అభ్యంతరం
ఇప్పుడు మాటా అభ్యంతరమే మౌనమూ అభ్యంతరమే
కలలూ అభ్యంతరమే కలయికలూ అభ్యంతరమే కవులూ అభ్యంతరమే
అసలు అక్షరమే అన్నింటికన్నా అతి ప్రమాదకర అభ్యంతరం
అన్ని యుద్ధాల్లోనూ ఆయుధాలుండవు…
ఇప్పుడు శాంతి కాంక్ష కూడా యుద్ధమే
కొసమెరుపుగా ఒక విషయం చెప్పాలి. జరిగిన తంతు ప్రపంచమంతా పొక్కిపోయింది. మీడియా ముక్కుమీద వేలేసుకుంది. హవ్వ అంటూ నోరు నొక్కేసుకుంది. అంతే ధర్మప్రభువులు గుక్క తిప్పుకుని మేం మాట్లాడింది టాల్స్టాయ్ వార్ అండ్ పీస్ గురించి కాదు, వేరే పుస్తకం గురించి అని మరో పుస్తకం ఏదో చూపించి రాత్రికి రాత్రే బొమ్మ తిప్పేశారు. ఏలిన వారు తలుచుకుంటే మామూలు మనుషులేం ఖర్మ, మహా రచయితలూ కూడా తారుమారు కావాల్సిందే. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉందాం. ఇక దేశభక్తి గీతగోవిందాలే కొందాం. ఓ రామ నీ నామమెంతో రుచిరా అని పాడుకుందాం. అదే సేఫ్.
డా.ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ