ఎక్కడి జనం వెర్రిగొర్రెలో, ఆ జాతిని చూసి జాలిపడండి!
ఎక్కడ గొర్రెల కాపరులే తమ వెర్రిగొర్రెల్ని పెడదోవ పట్టిస్తారో
ఆ జాతిని చూసి జాలిపడండి!
ఎక్కడ నేతలు పచ్చి అబద్దాలకోరులో,
ఎక్కడ జ్ఞానుల నోళ్లు బలవంతంగా మూయిస్తారో,
ఎక్కడ అసహనవాదులు గాలిని తరిమి, తరిమి కొడతారో ,
ఆ జాతిని చూసి జాలిపడండి!
ఏ జాతి, ప్రభువులను కీర్తించడానికి తప్ప, నోరు తెరవదో,
ఎక్కడ కర్రపెత్తందార్లకి వీరపూజలు జరుగుతాయో,
బలప్రయోగంతోనూ, అణచివేతలతోనూ,
ఏ జాతి ప్రపంచాన్ని ఏలాలని కలగంటుందో,
ఆ జాతిని చూసి జాలిపడండి!
తన భాష తప్ప మరొకటి తెలియని జాతిని చూసి జాలిపడండి!
తన సంస్కృతిని తప్ప వేరేదీ తెలియని జాతిని చూసి జాలిపడండి!
సంపాదననే శ్వాసించే జాతిని చూసి జాలిపడండి!
ఏ జాతయితే, కడుపునిండిన వాడిలా గుర్రుకొట్టి నిద్రపోతుందో,
తన హక్కులు తరిగి చెరిగిపోతుంటే,
తన స్వేచ్ఛ, స్వతంత్రం కరిగిపోతుంటే,
ఏ జాతి చూస్తూ ఊరుకుంటుందో,
ఆ జాతిని చూసి జాలిపడండి;
ఆ జాతి జనులను చూసి జాలిపడండి!!
స్వేచ్ఛకు పురిటిగడ్డయిన నా దేశం,
కన్నీరు మున్నీరవుతోంది!
నా జాతిని చూసి జాలిపడండి!
(ఖలీల్ జిబ్రాన్ కు క్షమాపణలతో… )
– లారెన్స్ ఫెలింగెట్టి
నూరేళ్ళ లారెన్స్ ఫెలింగెట్టి ప్రముఖ అమెరికన్ కవీ, నాటక కర్త, అనువాదకుడు, పెయింటర్, కళావిమర్శకుడు, సోషలిస్టు కార్యకర్త, సిటీలైట్స్ బుక్ సెల్లెర్స్ అండ్ పబ్లిషర్స్ సహ స్థాపకుడు. 2006 లో ఫెలింగెట్టి ఈ కవిత రాశారు
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ