NewsOrbit
వ్యాఖ్య

 ప్రశ్నించే స్వేచ్ఛ కావాలి

ఏ దేశంలో సామాన్యుడు కూడా పాలకులను నిర్భయంగా ప్రశ్నించగలడో ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిమళిస్తున్నట్టు లెక్క. ఏ దేశంలో న్యాయస్థానాలు కూడా నిజాలు నిగ్గు తేల్చమని పాలకులను నిలదీయడానికి నీళ్ళు నమలాల్సిన దుస్థితి దాపురిస్తుందో ఆ దేశంలో ప్రజాస్వామ్యం పాడె ఎక్కినట్టే అర్థం. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో వుంటున్నామని గొప్పలు చెప్పుకుంటాం. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులాంటి వాక్ స్వాతంత్ర్యమే అసలైన బాధితుడైన సందర్భంలో ఇప్పుడు మనం ఉన్నాం. సింహాసనారూఢులైన నేతల నిజాయితీని ప్రశ్నిస్తూ ఎవరు నోరు తెరిచినా జైళ్ళు వెంటనే నోళ్ళు తెరుస్తాయి. మేధావులు..జర్నలిస్టులు..కవులు..కళాకారులు..చరిత్రకారులు..రచయితలు..సైంటిస్టులు అంతా ఏం మాట్లాడాలన్నా భయపడుతున్న కాలంలో మనం ఉన్నాం. పుల్వామా తర్వాత బాలాకోట్ దాడి తర్వాత మీడియా పాలకులూ కలిసి ఆడిన విలయతాండవం తర్వాత ఆధారాలు చూపించమని అడగాలంటే భయం. అలా అడిగితే సైనికులనే శంకిస్తున్నావా దేశద్రోహీ అని నిందిస్తారని భయం. రాఫెల్ విమానాల ఒప్పందం పత్రాలు ఎందుకు రహస్యం? ఆ పత్రాలు ఎలా లీకయ్యాయి? లీకైన తర్వాత కూడా వాటి మీద చర్చించకూడదా? ఇలాంటి ప్రశ్నలు వేయాలంటే భయం. ఇదేమి దారుణం అని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆర్టీఐ చట్టాన్ని చదువుకున్నారా అని కూడా అడిగింది. ప్రతి సమాచారాన్నీ దేశభక్తితో దేశభద్రతతో ముడిపెట్టి పబ్బం గడుపుకోవాలంటే ఎలా? న్యాయమూర్తి జోసెఫ్ చేసిన వ్యాఖ్యల్లో ఇలాంటి అర్థాలే ధ్వనించాయి. 2005లో పార్లమెంటు చేసిన సమాచార హక్కు చట్టం విప్లవాత్మకమైనదని..దాని నుండి వెనక్కి మళ్ళడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలా పత్రాల గురించి మాట్లాడడమే దేశద్రోహంగా ప్రభుత్వం వారు వాదిస్తున్నారు. బయటకు లీకైన విషయాలు వాస్తవాలా? అబద్ధాలా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పమని అడగడం కూడా న్యాయం కాదని అంటున్నారు. ఇదేం న్యాయమని సాక్షాత్తూ అత్యున్నత న్యాయమూర్తులే సందేహాలు వ్యక్తం చేస్తున్న వేళ పాలనలో ఇంకెక్కడ పారదర్శకత? పత్రాలను గుప్తంగా వుంచే మీ హక్కును కాపాడడానికైనా ఆ పత్రాలను పరిశీలించే హక్కు కోర్టుకు లేదా అని జస్టిస్ జోసెఫ్ నిలదీశారు. సర్వోన్నత న్యాయస్థానానికే ప్రశ్నించే హక్కు లేకపోతే ఇక సామాన్య మానవుడి స్థితి ఏంకాను?  ఇదేనా మనం  గొప్పలు చెప్పుకుంటున్న అతిపెద్ద ప్రజాస్వామ్యం?

ప్రశ్నించడానికి అనువుగాని చోట.. సందేహాలకు తావు లేనిచోట..నిజనిర్ధారణకు నిజాయితీగా నిలబడే అవకాశాలే ఆవిరైన చోట ప్రజాస్వామ్యం బతికే వుందని ఎలా నిరూపించగలం? ఓటు హక్కు వినియోగించుకునే సాధారణ పౌరుడు అయ్యా తమరు గతంలో చేసిన వాగ్దానాల మాటేమిటి? ఎన్ని అమలు చేశారు? అయిదేళ్ళలో ఏం చేశారు? అభివృద్ధి ఎంత? అప్పు ఎంత? వ్యవసాయ రంగానికి..ఉద్యోగ రంగానికి..పారిశ్రామిక రంగానికి..ఇలా అనేక రంగాలకు మీరు ఒరగబెట్టినదేమిటి? అని అడగవద్దా? ఇలాంటి ప్రశ్నలు మేధావులు జర్నలిస్టులే కాదు..సాధారణ పౌరుడు కూడా అడిగే స్వేచ్ఛా స్వాత్రంత్ర్యాలు లేని దేశాన్ని ప్రజాస్వామిక దేశమని ఎలా పేరుపెట్టి పిలుస్తారో ఇప్పుడెవరు చెప్తారు?

కేవలం దేశభద్రతతో లింకుపడిన విషయాలలోనే కాదు, అతి మామూలు సమాచారాన్ని కూడా రహస్యం చేస్తున్నారు. ఆ సమాచారాన్ని తెలుసుకునే హక్కును కూడా హరిస్తున్నారు. అంకెల గారడీలు..గణాంకాల తమాషాలు. ఏది సత్యం..ఏది అసత్యం తెలుసుకోవాలన్న కుతూహలం కూడా ఎవరికీ కలగని భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సి.బి.ఐ.ని ఏం చేశారో చూశాం. సుప్రీం కోర్టును ఏం చేస్తున్నారో చూస్తున్నాం. రాజ్యాంగ సంస్థలను తమ జేబు సంస్థలుగా దిగజార్చి ప్రజాస్వామ్య విలువలనే పరిహసిస్తున్నారు. పాలక మహాశయులారా ఇది మీకు తగదు. సమాచారం బయటపెట్టండి. అన్ని విషయాలూ తెలుసుకునే హక్కు ఇక్కడ అందరికీ వుందని 108 మంది ఆర్థికవేత్తలు,సామాజిక శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని అర్థిస్తూ ఒక అర్జీ పెట్టుకున్నారన్నది తాజా వార్త. రాజ్యాంగ సంస్థల స్వాతంత్ర్యాన్ని.. అనేక రంగాలకు చెందిన సమాచారాన్ని గణాంకాలను తయారుచేసే వ్యవస్థల సమగ్రతను కాపాడండి మహాప్రభో అంటూ వారు ప్రభుత్వాన్ని ప్రార్థిస్తూ ఒక ఫిర్యాదు పత్రం మీద సంతకాలు చేసి సమర్పించారు. వీరు చెప్పిన విషయాలు చూస్తే దేశంలో ఏం జరుగుతోంది? పాలకులు ఎంత గోల్ మాల్ చేస్తున్నారు? ఏ లెక్కలో నిజమెంత? ఏ లెక్కను తొక్కేశారు? అంతా అయోమయంగా వుంటుంది మనకు. ఎన్నికలను సంక్షేమ పథకాల సర్కస్ ఫీట్లగా తయారుచేసిన ఘనత వహించిన మన ఏలికలు సమాధానాలు చెప్పాల్సిన విషయాలు చాలా వున్నాయి. ఒక్క జీడీపీ విషయంలోనే చాలా జిమ్మిక్కులు జరిగాయని ఈ మేధావులు తేల్చి చూపుతున్నారు. వాస్తవాలను తారుమారు చేసి తమకు అనుకూలమైన లెక్కలను అధికార వెబ్ సైట్లో పెట్టినట్టు తేలింది. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఇచ్చిన వివరాలను తొలగించి, సి.ఎస్.ఓ.( సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ) తయారు చేసిన గణాంకాలను ప్రజల ముందుంచింది నీతి ఆయోగ్.  సి.ఎస్.ఓ. అలాగే ఎన్.ఎస్.ఎస్.ఓ. (నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్) వంటి సంస్థలు స్వతంత్రంగా పని చేయాలి. వాటిలో రాజకీయ జోక్యం తగదని దేశవిదేశాలకు చెందిన ఈ మేధావులు భారత ప్రభుత్వానికి విన్నపాలు చేసుకున్నారు. ఉద్యోగాలకు సంబంధించిన లెక్కలు కూడా మసిపూసి మారేడు కాయ చేసే యత్నాలు జరిగాయట. ప్రతి రంగంలోనూ సర్వేలు జరిపి డేటా తయారు చేస్తారు. ఆ డేటాను చూస్తే ప్రభుత్వం ఏ రంగంలో ఏం సాధించిందో తెలుస్తుంది. అందుకే మన నేతలు దేశం తలరాతలు ఎలా వున్నాయో బహిర్గతం చేసే డేటాను తొక్కిపట్టడం కాని..ఏకంగా తారుమారు చేయడం కాని..మొత్తానికి మాయం చేయడం కాని చేస్తున్నట్టు వాస్తవాలు చెప్తున్నాయి. ఈ విషయం మీదనే మేధావులు ప్రశ్నిస్తున్నారు. తాము తయారు చేసిన లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను బయటపెట్టకుండా ఏకంగా దాన్ని రద్దు చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టు వస్తున్న వార్తలు ఒక వైపు..జీడీపీ విషయంలో సాగిన తంతు మరో వైపు చూసి ఎన్.ఎస్.సి. చైర్మన్, మరో ఇద్దరు సభ్యులు రాజీనామా చేశారట.

ఇదంతా చూస్తుంటే మనకేమనిపిస్తుంది. మనం చూస్తున్నది నిజం కాదు. మనం నిజం అనుకుంటున్నది నిజం కాదు. మరి ఏది నిజం? దాన్ని మేధావులే తెలుసుకునే అవకాశాలు లేవు. ఇక సామాన్యుడి మాటెక్కడ? అందుకే అనుమానం వస్తుంది. మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలోనా? లేక ప్రజాస్వామ్యం సూటు బూటు వేసుకుని గర్జించే నియంతృత్వంలోనా?

ప్రశ్నించే స్వేచ్ఛ మనకెప్పుడు వస్తుంది? వసంతంలో కోకిల కూసినట్టు, వర్ష రుతువులో వానపడినట్టు, ఎండాకాలం ఎండలు మండినట్టు అత్యంత సహజంగా, మనం ఎన్నికల కాలంలోనే కాదు, ఎల్లప్పుడూ మనల్ని పాలించే నాయకుల్ని నిలదీసే రోజు ఎప్పుడొస్తుంది? నిజాలు తెలుసుకోవాలని కోరుకోవడం నేరం కాదు, దేశద్రోహం కాదు. అది ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తించే రోజు ఎప్పుడొస్తుంది? భయం లేని బతుకు..భయం లేని నిద్ర..భయం లేని కలలు..భయం లేని నడక..భయం లేని మాట..భయం లేని ఊహ..భయం లేని రాత..భయం లేని చేత.. ఇవన్నీ ఎప్పుడు ఈ దేశం సగటు పౌరుడికి ఆయుధాలుగా అమరుతాయి? అప్పుడు కదా నిజంగా అతను పారతంత్ర్యం మీద యుద్ధం చేసిన నిజమైన స్వతంత్రుడవుతాడు.  అప్పుడు కదా అసలైన ప్రజాస్వామ్యం అసలైన అర్థంలో పరిమళిస్తుంది. విశ్వకవి రవీంద్రుని మాటలే ఇక్కడ గుర్తుకొస్తున్నాయి.

ఎలాంటి భయాలూ మనసుకు ముసురుకోని చోట..నిర్భయంగా తలెత్తుకొని మనుషులు  మసలే చోట..

జ్ఞానం స్వేచ్ఛగా వికసించే చోట..ఇరుకు ఇరుకు గోడల మధ్య ప్రపంచం ముక్కలు కాని చోట..నిజం మూలాల్లోంచి మాటలు ఉబికే చోట..మృత వ్యసనాల ఎడారి ఇసుకల్లో పడి సత్య ప్రవాహం ఇంకిపోని చోట..ఆలోచనా ఆచరణా నిత్యం విస్తరించే దిశగా మనస్సును నువ్వు నడిపించే చోట..ఓ తండ్రీ అలాంటి స్వేచ్ఛా  స్వర్గంలోకి నా దేశాన్ని మేల్కొలుపు

ప్రసాదమూర్తి

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment