మోదీ ఇంటర్వ్యూల్లో పస ఎంత?

Share

ప్రధాని నరేంద్ర మోదీ  ఎఎన్‌ఐ వార్తా సంస్థ ఎడిటర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను కాంగ్రెస్ పార్టీ ‘ఫిక్సింగ్‌’గా అభివర్ణించింది. చాలకాలం తర్వాత ప్రధాని ఓ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ఇంత వరకూ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు. భారతదేశ ప్రధానుల్లో ఈ ‘ఘనత’ ఒక్క మోదీకే దక్కింది. అంతేకాదు. గతంలో ప్రధానమంత్రి ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా తన విమానంలో మీడియా బృందాన్ని వెంట తీసుకువెళ్లడం ఆనవాయితీ. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ సంప్రదాయానికి కూడా  తిలోదకాలు ఇచ్చారు.

ఇక ఫిక్సింగ్ ఆరోపణ విషయానికి వస్తే ప్రధానమంత్రి వంటి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నవారు ఎవరైనా గానీ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇద్దామని అనుకున్నపుడు ముందుగా ప్రశ్నలు చూడడం, వాటిలో మరీ ఇబ్బందికరమైన వాటిని పక్కన పెట్టడం మామూలే. అయితే అది కొంతవరకే. మరీ కేక్‌వాక్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు!. సవాలు లాంటి ప్రశ్నలను ఎదుర్కొనేందుకు జవహర్ లాల్ నెహ్రూ, లాల్‌బహదుర్ శాస్త్రి, ఇందిరా గాంధీ ఏనాడూ వెనుకాడేవారు కాదు. మౌనీబాబాగా పేరొందిన మన్మోహన్ సింగ్ కూడా మీడియాను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ వెనుకాడలేదు.

ప్రధాని అయిన తర్వాత మోదీ మొదటి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ అర్నబ్ గోస్వామికి ఇచ్చారు. అర్నబ్ ‘దేశభక్తి’ గురించి దేశం అంతటా తెలిసిందే. అప్పట్లో టైమ్స్‌నౌ ఛానల్‌లో పని చేసిన గోస్వామి ప్రస్తుతం  రిపబ్లిక్ టివిలో పని చేస్తున్నారు. ఆయన రోజూ రాత్రి పూట నిర్వహించే చర్చా కార్యక్రమం చూసిన వారికి ఆయన గురించి చెప్పనవసరం లేదు. తర్వాత ప్రధాని మోదీ ఆమధ్య ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినపుడు భారత సెన్సార్ బోర్డు ఛైర్‌పర్సన్ ప్రసూన్ జోషికి ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ దయ వల్ల పదవి దక్కించుకున్న జోషి ప్రధానిని ఎలాంటి ప్రశ్నలు అడగగలరో మనం ఊహించుకోవచ్చు. మధ్యలో టైమ్స్ నౌ ఛానల్‌కు కూడా ఒక  ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇప్పుడు ఎఎన్‌ఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల ముందు తాను దేశప్రజలకు చెప్పదలచుకున్న అంశాలన్నీ ఆ ఇంటర్వ్యూలో వచ్చేట్లు మోదీ జాగ్రత్త తీసుకున్నారు. ఎఎన్‌ఐ ఎడిటర్ స్మితా ప్రకాశ్ అడగాల్సిన ప్రశ్నలు అన్నీ అడిగారు. మోదీ చెప్పాలనుకున్న సమాధానాలు అన్నీ చెప్పారు. ఆ సమాధానాలపై సహజంగా రావాల్సిన అనుబంధ ప్రశ్నలు స్మిత నుంచి ఎదురు కాలేదు. అదీ అసలు కిటుకు. వివాదాస్పద అంశాలు అన్నిటిపై మాట్లాడినట్లూ ఉంటుంది, అసలు విషయం దాటవేయడానికీ కుదురుతుంది. మోదీ సహజంగానే చాలా దిలాసాగా తనదైన శైలిలో అలవోకగా సమాధానాలు చెప్పారు.

ప్రధాని ఒక జర్నలిస్టును ఎన్నుకుని ఆమెకు ఇంటర్వ్యూ ఇస్తే ఇంతకన్నా ఏమీ జరగదు.  నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రముఖ టివి జర్నలిస్టు కరణ్ థాపర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. థాపర్ గడ్డు ప్రశ్నలు వేయడంలో పేరు మోసిన జర్నలిస్టు. ఆ ఇంటర్వ్యూలో మోదీ మధ్యలోనే లేచిపోయారు. ఆ రోజు తాను అహ్మదాబాద్‌లో విమానం దిగిన దగ్గర నుంచీ  మోదీ తనను ఎంత బాగా చూసుకుందీ ఇటీవల విడుదల అయిన తన పుస్తకం డెవిల్స్ ఎడ్వకేట్‌లో కరణ్ థాపర్ వివరించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున తర్వాత ఇంటర్వ్యూలో గడ్డు ప్రశ్నలు వస్తాయని ఊహించని మోదీ మధ్యలో లేచిపోయారు తప్ప వాటిని ఎదుర్కొనేందుకు మాత్రం సిద్ధపడలేదు. అలాంటి వ్యక్తి ప్రధాని అయినంత మాత్రాన భిన్నంగా వ్యవహరిస్తారని అనుకోవాల్సిన పని లేదు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాదాపు వందమంది దేశ విదేశీ జర్నలిస్టుల ఎదురుగా కూర్చుని ప్రశ్నలు ఎదుర్కోవడానికి కాస్త ధైర్యం కావాలి. ప్రస్తుత ప్రధానికి చెప్పుకోవడానికి ఛప్పన్ ఇంచ్ కీ ఛాతీ ఉంది కానీ అందులో ఉండాల్సింది లేదు.

-సురయ్యా

 

 


Share

Related posts

శివసైనికులు మా వెంటే: బిజెపి ఎంపి సంచలన వ్యాఖ్యలు

somaraju sharma

కృష్ణపట్నం పోర్టులో ఆదానీ గ్రూపు వాటా..!!

somaraju sharma

న్యాయ కమిషన్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

somaraju sharma

Leave a Comment