మరో దాడి చేస్తారట!

ఎన్నికలకు ముందు బీజేపీ ప్లాన్ ఇదే
మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఏడు దశల పోలింగ్ పైనా మండిపాటు
కోల్ కతా: ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ కుట్రలో భాగంగా మరోసారి దాడి చేయాలనుకుంటున్నారని ఆమె చెప్పారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేస్తామని కూడా మమత తెలిపారు. మరోసారి దాడి ఉంటుందని కొందరు సీనియర్ పాత్రికేయులు తనకు చెప్పారని అన్నారు. అదేం దాడో మాత్రం తనకు తెలియదని, ఏప్రిల్లో జరుగుతుందని తెలిపారు. అందుకే పోలింగ్ మే 19 వరకు సాగదీశారని మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. అక్కడ మొత్తం 42 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. అన్నీ తామే గెలుస్తామని మమత ధీమా వ్యక్తంచేస్తున్నారు.

పెడర్ధాలు తీయద్దు..
తాను చెప్పిన మాటలకు పెడర్ధాలు తీయద్దని ఆమె విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగసంస్థ మీద తనకు చాలా గౌరవం ఉందన్నారు. కానీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలన్నది బీజేపీ కుట్ర అని విమర్శించారు. భారతదేశం యుద్ధం లాంటిదేదో చేస్తోందన్నట్లు నర్మగర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ నేతలు వెంటనే ఆమె ఆరోపణలు నిరాధారమని ఖండించారు. నిరాధార ఆరోపణలు చేయడం ఆమెకు అలవాటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఊరికే గాలిపటాలు ఎగరేయడం కాదని, ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఇదంతా బీజేపీ కుట్రే
పోలింగ్ ఎక్కువ కాలం సాగదీసినా తమకు ఇబ్బంది లేదు గానీ, ఎండల్లో ఓటర్లు ఇబ్బంది పడతారని మమతా బెనర్జీ అన్నారు. రంజాన్ పవిత్రమాసంలో ఎన్నికలు పెడితే ముస్లింలు ఉపవాస దీక్షలతో ఇబ్బంది పడతారని కొందరు సీనియర్ నేతలు చెప్పారు. తనకు బెంగాలీల పట్ల అపార గౌరవం ఉందని, కానీ బీజేపీ మాత్రం వారిని అవమానిస్తోందని మమత అన్నారు. బెంగాల్ మీద కుట్ర చేస్తే వారికే ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పారు. కేవలం యూపీ, బిహార్, తమ రాష్ట్రంలోనే ఏడు దశల పోలింగ్ ఉందని గుర్తుచేశారు.