ఆ ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. యాజమాన్యం వదిలించుకోక తప్పదన్న నిర్ణయానికి వచ్చింది. అయితే అందుకు భారీగా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎంతంటే మూడున్నర కోట్ల డాలర్లు. అంటే సుమారుగా 243 కోట్ల రూపాయలు.
అమిత్ సింఘాల్ గూగుల్‌లో సెర్చ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవారు. 2016లో గూగుల్ యాజమాన్యం ఆయనతో రాజీనామా చేయించింది. ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలే అందుకు కారణం. రాజీనామా చేసినందుకు ఆయనకు 35 మిలియన్ డాలర్ల ప్యాకేజి చెల్లించినట్లు గూగుల్ కోర్టుకు సమర్పించిన పత్రాల ద్వారా తెలిసిందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ పేర్కొన్నది.
ఈ సంగతులు కూడా ఒక వాటాదారు గూగుల్‌పై వేసిన కేసు వల్ల బయటకు వచ్చాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతోద్యోగులను వదుల్చుకునేందుకు గూగుల్ భారీగా చెల్లింపులు చేస్తున్నదని ఆ మధ్య వార్తలు వచ్చాయి. దానితో ఒక వాటాదారు కోర్టుకు ఎక్కాడు. అక్కడ సమర్పించిన పత్రాల ద్వారా సింఘాల్‌కు జరిగిన చెల్లింపులు బయటకు వచ్చాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల విషయంలో ఇక కఠినంగా వ్యవహరిస్తామని ఇటీవల గూగుల్ ప్రకటించింది.