సైలెంట్‌గా షాకిచ్చిన కేసీఆర్‌… త‌ర్వాత ఏంటి జ‌గ‌న్‌?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల మ‌ధ్య ఉన్న ఎంతో స‌ఖ్య‌త ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే, వీరిద్ద‌రి మ‌ధ్య విబేధాల‌కు కార‌ణంగా మారింది ఇరు రాష్ట్రాల మ‌ధ్య దీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న నీటి వివాదం.

 

ఈ వివాదంలో తాజాగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైలెంట్‌గా షాకిచ్చార‌ని అంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న‌ రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం, పోతిరెడ్డిపాడు విస్త‌ర‌ణ‌పై జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్‌(ఎన్జీటీ) చెన్నై ధ‌ర్మాస‌నం తీర్పు వెల్ల‌డించిన నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

అప్ప‌ట్లోనే కేసీఆర్ స్కెచ్‌?

ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)కి ఫిర్యాదు చేసింది. ఎన్జీటీలో విచార‌ణ సంద‌ర్భంగా కీల‌క వాద‌న‌లు వినిపించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రభుత్వఅదనపు అడ్వకేట్‌ జనరల్‌ రాంచందర్‌రావు వాద‌న‌లు వినిపిస్తూ, ఎన్జీటీలోని నలుగురు సభ్యుల కమిటీలో ఒక్క సభ్యుడు మాత్రమే ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విచారణలో భాగంగా ఎన్జీటీ నలుగురు సభ్యులతో కమిటీని నియమించగా.. అందులో ఇద్దరు ఏపీ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారని, మరొకరు మౌనంగా ఉండగా.. కేవలం ఒకే ఒక్క సభ్యుడు ఇచ్చిన నివేదికను ఏవిధంగా పరిగణనలోనికి తీసుకుంటారని అన్నారు.

ఏపీ అన్యాయం చేస్తోంద‌ని…

ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఇప్పుడున్న దానికంటే రెట్టింపు నీటిని తరలించే అవకాశం ఉందని తెలంగాణ ప్ర‌భుత్వం ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పదిలక్షల ఎకరాలకు అదనంగా నీరందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని, ప్రాజెక్టులోని అంశాలను పూర్తిగా పరిశీలించకుండానే నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడం తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును భారీగా విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించిందని, ట్రిబ్యునల్‌ అంగీకరిస్తే హెలిక్యాప్టర్‌లో పోతిరెడ్డిపాడు ప్రాంతానికి తీసుకువెళ్లి వాస్తవాలను రుజువు చేస్తామని పేర్కొన్నారు.

ఇప్పుడు తీర్పు రావ‌డంతో..

తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా, వ్యూహాత్మ‌కంగా వినిపించిన వాద‌న‌లో ఎన్జీటీ నేడు తుది తీర్పు వెలువ‌రించింది. ప్రాజెక్టుల‌ నిర్మాణానికి ప‌ర్యావ‌ర‌ణ అనుమతులు తీసుకోవాల్సిందేన‌ని ఎన్జీటీ స్ప‌ష్టం చేసింది. ప‌ర్యావ‌ర‌ణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుపై ముందుకు వెళ్లొద్ద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు డీపీఆర్ స‌మ‌ర్పించి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు తీసుకోవాల‌ని ఆదేశించింది. తాగునీటితో పాటు సాగునీటి అవ‌స‌రాలు కూడా ఉన్నాయ‌ని ఎన్జీటీ అభిప్రాయ‌ప‌డింది. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లొద్ద‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి రాసిన లేఖ విష‌యాన్ని ఎన్జీటీ గుర్తు చేసింది.