Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పార్టీ అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి, గోషామహల్ టికెట్ తనకే కేటాయిస్తారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ కొద్ది రోజులుగా ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒక వేళ బీజేపీ తనకు టికెట్ కన్ఫర్మ్ చేయకపోతే తాను పోటీ చేయననీ, హిందూ ధర్మం కోసమే పని చేస్తానని ప్రకటించారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ పై పార్టీ అధిష్టానం గత ఏడాది ఆగస్టు 23న సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు బీజేపీ క్రమశిక్షణా సంఘం కార్యదర్శి ఓం పాఠక్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేయడంతో రాజాసింగ్ కు ఊరట కలగనుంది. ఈ ఎన్నికల్లో ఆయన గోషామహల్ నుండే పోటీ చేసే అవకాశం ఉంది. తొలి జాబితాలోనే రాజాసింగ్ పేరు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
గతంలో బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. రాజాసింగ్ వరుసగా రెండు సార్లు గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి రాజాసింగ్ ఒక్కరే ఎన్నికైయ్యారు. ఆ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రఘునందనరావు, ఈటల రాజేందర్ లు బీజేపీ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచారు.
High Alert: కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన .. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్