బీజేపీ నుండి సస్పెన్షన్ కు గురైన గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ 115 మందితో అసెంబ్లీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసిన సంగతి విదితమే. అయితే గోషమహల్ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిని కేసిఆర్ ప్రకటించలేదు. దీంతో ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ లో చేరి మరల గోషమహల్ నుండి పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీటిపై రాజాసింగ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను బీఆర్ఎస్ లో చేరడం లేదని స్పష్టం చేశారు రాజాసింగ్. తన సస్పెన్షన్ ను పార్టీ ఎత్తివేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తాను పోటీ చేస్తే బీజేపీ నుండే పోటీ చేస్తాననీ చెప్పారు. బీజేపీ తన సస్పెన్షన్ ఉపసంహరించుకోకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయనని చెప్పారు. తనకు బీజేపీ టికెట్ కేటాయించకుంటే రాజకీయాలకు కొంత కాలం విరామం ఇచ్చి హిందూ రాష్ట్రం కసం పని చేస్తానని అన్నారు. అంతే కానీ లౌకిక పార్టీలోకి చర్చినా వెళ్లేది లేదని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కమిటీ, సెంట్రల్ కమిటీ తమ విషయంలో సానుకూలంగా ఉంటుందని చెప్పారు. తనపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయడానికి వారు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని రాజాసింగ్ తెలిపారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్, ఎంఐఎం బంధంపైనా కీలక కామెంట్స్ చేశారు రాజాసింగ్. గోషమహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్ధిని కూడా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయిస్తారని అన్నారు. ఓవైసీ సోదరులు ఎవరి పేరు సూచిస్తే వారికే కేసిఆర్ గోషమహల్ టికెట్ ఇస్తారని అన్నారు.
ఈనాడుకు షాక్ ఇచ్చేలా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. పరువు నష్టం దావాకు ఉత్తర్వులు జారీ