(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
భయానకమైన టెరరిస్టు కార్యకలాపాలతో కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఐఎస్ఐఎస్ నేత అబూబకర్ ఆల్ బాగ్దాదీ మరణించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఉదయం (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:45 గంటలకు) వైట్‌హౌస్‌లో మీడియా ముందు ఈ ప్రకటన చేశారు.
నిన్న రాత్రి అమెరికా ప్రత్యేక దళాలు సిరియాలోని ఒక ప్రాంతంలో బాగ్దాదీ తలదాచుకున్న కాంపౌండ్‌పై దాడి చేశాయి. రెండు గంటల పాటు జరిగిన ఈ సైనికచర్యలో బాగ్దాదీ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కాంపౌండ్‌లో ఉన్న భూగర్భ సొరంగంలో తలదాచుకున్న బాగ్దాదీ అమెరికా సైనిక జవాన్లకు పట్టుబడకుండా ఉండేందుకు ఆత్యహత్య చేసుకున్నాడు. తాను ధరించిన పేలుడు పదార్ధాలతో తయారు చేసిన జాకెట్‌ను పేల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతి చెందింది బాగ్దాదీయేనని తర్వాత డిఎన్ఎ పరీక్ష ద్వారా నిర్ధారించుకున్నారు.
అతనితో పాటు అక్కడ ఉన్న ముగ్గురు పిల్లలు కూడా ఈ పేలుడులో చనిపోయారు. ఈ దాడి మొత్తాన్నీ తాను వైట్‌హౌస్‌నుంచి ప్రత్యక్షప్రసారం ద్వారా చూశానని ట్రంప్ చెప్పారు. బాగ్దాదీ కుక్కచావు చచ్చాడు ఇని ఆయన అన్నారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో అమెరికా వైపున ప్రాణనష్టం లేదని ఆయన పేర్కొన్నారు.