యూరోపియన్ శాస్త్రవేత్తలు ఫొటో తీసిన బ్లాక్‌హోల్ ఈ గెలాక్సీలోనే ఉంది
పారిస్: యూరోపియన్ సైంటిస్టులు మొత్తం మీద బ్లాక్‌హోల్‌ను మొదటిసారిగా ఫొటో తీయగలిగారు. విశ్వాంతరాళంలో పదార్ధం గురుత్వాకర్షణ శక్తి ఒక స్థాయి దాటిపోతే ఇక ఆ వలయం నుంచి కాంతి కూడా బయటపడలేదు. అదే బ్లాక్‌హోల్. ఎలాంటి పదార్ధమైనా దాని దగ్గరకు వెళితే అందులో కలిసిపోవాల్సిందే. ఆఖరికి నక్షత్రమైనా సరే. దీని గురుత్వాకర్షణ నుంచి కాంతి కూడా తప్పించుకోలేదు కాబట్టి ఇక బ్లాక్‌హోల్స్ మనకు కనబడే అవకాశం లేదు.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు ఎనిమిది భారీ రేడియో టెలిస్కోపులను అనుసంధానించి ఈ బ్లాక్‌హోల్‌ను ఫొటో తీయగలిగారు. ఫొటోలో నిజానికి బ్లాక్‌హోల్ కనబడదు. దాని చుట్టూ ఆవరించుకుని ఉన్న అధిక ఉష్ణోగ్రత వాయువులు, ప్లాస్మా నారింజ రంగు వలయంగా కనబడుతున్న కారణంగా మధ్యలోని నలుపు బ్లాక్‌హోల్‌ను మనం చూస్తున్నట్లు లెఖ్క.
సైంటిస్టులు ఫొటో తీసిన ఈ బ్లాక్‌హోల్ అయిదు కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఎమ్87 అనే గాలాక్సీలో ఉంది. అంటే సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే అక్కడకు వెళ్లడానికి అయిదు కోట్ల సంవత్సరాలు పడుతుందన్న మాట. అంత దూరంలోని బ్లాక్‌హోల్‌ను ఫొటో తీయడం అంటే చంద్రుని మీద ఉన్న ఒక చిన్న రాయిని ఇక్కడ నుంచి ఫొటో తీయడం లాంటిది అని ఒక శాస్త్రవేత్త పోల్చిచెప్పారు.