జపాన్‌లో ‘హగిబిస్’ బీభత్సం!

                                                                                                                                                   (న్యూస్ ఆర్బిట్ డెస్క్)

జపాన్‌ను మరో శక్తివంతమైన తుఫాను వణికిస్తోంది. ‘హగిబిస్‌ టైఫూన్’ జపాన్ లో బీభత్సం సృష్టిస్తున్నది. కుండపోత వర్షం కురుస్తుండటంతో జపానీలు చికురుటాకుల్లా వణికిపోతున్నారు. జనజీవనం స్తంభించిపోయింది. ఈ తుఫాను ధాటికి ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వందలాది ఇళ్లు వరద ప్రవాహంలో కొట్టుకొనిపోయాయి. ‘హగిబిస్’ అంటే ఫిలిపినో భాషలో స్పీడ్ అని అర్థం. గత అరవై ఏళ్లలో ఇలాంటి భయంకర తుపాను సంభివించలేదు. ఈ తుఫానుతో జపాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తుఫాను వలన వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ ఆస్తినష్టం సంభవించింది. తూర్పు, సెంట్రల్‌ జపాన్‌లో హగిబిస్‌ తుఫాను బీభత్సం సృష్టించింది.

టోక్యోతోపాటు గున్మా, సైతమా, కనగవ, ఫుకుషిమ, మియాగి తదితర ప్రాంతాల్లో తుపాను విస్తరించింది. షిజౌకాలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించిన తరువాత తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  టోక్యో, పరిసర ప్రాంతాల్లో 800 మిమీ వర్షపాతం నమోదవ్వొచ్చన్నది స్థానిక వాతావరణ సంస్థల అంచనా. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీ ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీటిలో కార్లు తేలియాడుతున్నాయి. పోలీస్, మిలిటరీ దళాలు తుపాను ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. ఇళ్ల నుంచి 48 గంటల పాటు బయటకు రావద్దని ప్రజలకు జపాన్ ప్రభుత్వం సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

పసిఫిక్ మహాసముద్రంలో తరచూ భూకంపాల ప్రభావానికి లోనయ్యే జపాన్ ని 1958 తర్వాత అత్యంత తీవ్రస్థాయిలో హగిబిస్‌ టైఫూన్ జపాన్ ను వణికిస్తోంది. తుఫాను బలపడే ప్రమాద ముందని జపాన్ వాతావారణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు రైలు, విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే శనివారం జరగాల్సిన రగ్బీ ప్రపంచ కప్‌ మ్యాచ్‌తో పాటు ఇతర కార్యక్రమాలను కూడా నిర్వాహకులు రద్దు చేశారు.