(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇంద్రాణీ ముఖర్జీ… కొత్తగా పరిచయం అవసరం లేని పేరు. కొన్నేళ్ల క్రిత్రం దేశమంతా మార్మోగిన పేరు. ఒక టీవీ ఛానెల్ గ్రూపు అధిపతిగా, మరో పెద్ద టీవీ గ్రూపు సిఇఓ భార్యగా హై సర్కిల్స్‌లో ఓ వెలుగు వెలిగిన ఇంద్రాణీ.. ఆస్తి కోసం తన సొంత కుమార్తెను దారుణంగా హత్య చేసి వార్తల్లో నిలిచారు. తన కూతురు షీనా బోరా పేరిట భారీ మొత్తంలో సొమ్మును విదేశాల్లో దాచిపెట్టారు ఇంద్రాణీ. పరిస్థితులు వికటించడంతో పెద్ద స్కెచ్ వేసి మొదటి భర్త సాయంతో షీనాను చంపేశారు. విలాసవంతమైన జీవితం కోసం ఇంద్రాణి ముఖర్జియా ఆడిన ఓ నాటకంలో మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్, మూడో భర్త పీటర్ ముఖర్జియాలు ప్రధాన పాత్ర పోషించారు. ఫలితంగా ఓ యువతి జీవితాన్ని అర్థాంతరంగా ముగించేశారు.
పీటర్ భార్యగా కార్పొరేట్ ప్రపంచంలో కాలుమోపాక ఇంద్రాణి జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. ఈ జీవితం ఇదేవిధంగా అనుభవించాలన్నా… కొనసాగాలన్నా.. తనకు మొదటి భర్త సిద్ధార్థ్ ద్వారా ఇద్దరు పిల్లులున్నారనే విషయం బాహ్య ప్రపంచానికి తెలియకుండా దాచాలని భావించింది. ఆ ప్రకారంగా తన సంతానాన్ని కన్నబిడ్డలనికాక తోడబుట్టినవాళ్ళలా సమాజానికి పరిచయం చేసింది. పాత ఇంద్రాణి ఇకపై కనిపించకూడదన్న లక్ష్యంతోనే ఆమె ప్రతి అడుగూ అత్యంత జాగ్రత్తతో వేసింది. అయితే, షీనా బోరా ముంబైకు వచ్చాక…తన కూతురినని ఎక్కడా చెప్పొద్దని ఆంక్షలు పెట్టి చెల్లెలిగానే తన కార్పొరేట్ సమాజానికి పరిచయం చేసింది. తన మూడో భర్త పీటర్‌కు కూడా అదే చెప్పింది. పీటర్ కుటుంబంలోకి అడుగుపెట్టాక… అతని కుమారుడు రాహుల్‌తో షీనా బోరా ప్రేమలో పడిపోయింది.
రాహుల్ – షీనాల బంధాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక పోయింది ఇంద్రాణీ. కూతుర్తెను నయానోభయానో నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికీ రాహుల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన షీనా.. తల్లి మాట వినలేదు కదా.. తల్లికే ఎదురుతిరిగింది. తనని కట్టడిచేస్తే తాను కూతురిననే విషయం బయటపెడతానని హెచ్చరించింది. దీంతో షీనా జీవించి ఉంటే.. తనకు ఎపుడైనా ప్రమాదం తప్పదని పసిగట్టిన ఇంద్రాణి.. ఆమెను శాశ్వతంగా లేకుండా చేయాలని నిర్ణయం తీసుకుని, తన రెండో మాజీ భర్త, కారు డ్రైవర్ సాయంతో ఆ పని పూర్తి చేసింది. ప్రస్తుతం ఇంద్రాణీ ముఖర్జియా షీనా బోరా హత్య కేసులో ముంబయిలోని బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దీనికితోడు ఆమె ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో అప్రూవర్‌గా మారారు. ఇదే కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను సీబీఐ ఆరెస్ట్ చేసింది.