మోదీ-షా ద్వయానికి చెడ్డ రోజులు మొదలు!!

ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ద్వయానికి చెడ్డ రోజులు ప్రారంభం అయినట్లున్నాయి. రానున్న  లోక్‌సభ ఎన్నికలకు రిహార్సల్‌గా అందరూ భావించిన మొన్నటి అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో అధికారపక్షానికి ఎదురుదెబ్బ తగిలితే పార్టీలో భిన్న స్వరాలు వినబడడం మొదలు కావచ్చని అనుకున్నదే. అనుకున్నట్లుగానే పార్టీలోనే కాకుండాప్రధా బయటనుంచి మద్దతు ఇస్తున్న రామ్‌దేవ్ బాబా వంటి వారు కూడా గొంతు మారుస్తునారు.

సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మొదట నోరు విప్పారు. చట్ట సభల సభ్యులు సరిగా పని చేయకపోతే అందుకు పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని గడ్కరీ వ్యాఖ్యానించారు. నిజానికి గడ్కరీ భిన్నస్వరం వినిపించడం ఇదే మొదట కాదు. మొన్నా మధ్య కూడా విజయాలకూ, పరాజయాలకూ పార్టీ  నాయకత్వమే బాధ్యత వహించాలని అన్నారు కానీ ఆ తర్వాత సర్దుకున్నారు.

పార్టీ నాయకత్వంపై మళ్లీ బహిరంగంగా వ్యాఖ్యానించడానికి గడ్కరీ సిద్ధపడ్డారంటే పార్టీలో వ్యవహారం కాస్త మారిందనే అనుకోవాల్సి వస్తుంది. పార్టీ వ్యవహారాలపై వ్యాఖ్యానించడంతో గడ్కరీ సరిపెట్టలేదు. సహనం భారతదేశ సంస్కృతిలో భాగమని అన్నారు. ప్రముఖ హిందీ నటుడు నసిరుద్దీన్ షాపై బిజెపి, సంఘ్ కార్యకర్తలు విషం చిమ్మతున్న నేపధ్యంలో ఈ మాటలకు కూడా ప్రధాన్యత ఉంది. జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకాలు లేకుండా చేయాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపధ్యంలో గడ్కరీ ప్రధమ ప్రధానిని కూడా గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రసంగాలు తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు.

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత ఇంతవరకూ బిజెపి నాయకత్వం ఫలితాలను సమీక్షించలేదు. సాధారణంగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ సమీక్ష జరుగుతుంది. ఇంతవరకూ ఎలాంటి సమావేశం జరగలేదు సరి కదా అగ్రనాయకత్వం నోరు విప్పలేదు. గడ్కరీ వ్యాఖ్యలను ఈ నేపధ్యంలో చూడాల్సి ఉంటుంది. సంఘ్ నాయకత్వానికి సన్నిహితుడిగా పేరు పడ్డ గడ్కరీ పేరు భవిష్యత్తులో ప్రధాని పదవికి పరిశీలనలో ఉంటుందని కూడా వినబడుతోంది. అయితే తాను ఎలాంటి రేసులోనూ లేనని ఆయన అంటున్నారు.

మరోపక్క బిజెపికి  సన్నిహితుడిగా పేరుపడ్డ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ కూడా మాట మార్చారు. తర్వాతి ప్రధాని ఎవరని ఆయనను ప్రశ్నించినపుడు ఇప్పుడే చెప్పడం కష్టమని అన్నారు.