మీ మొబైల్ మీమీదే నిఘా పెడితే..!

 

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

వాట్సాప్ ద్వారా ఇండియాలో కొందరి మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేశారన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. వాట్సాప్ చాలా సురక్షితమైన యాప్ అనీ, దాని ద్వారా నడిపే మెసేజ్‌లూ, కాల్స్‌పై నిఘా ఎవరికీ సాధ్యం కాదనీ వాట్సాప్  యాజమాన్య సంస్థ అయిన ఫేస్‌బుక్ చెప్పుకుంటున్నది. కానీ వాట్సాప్ రక్షణ కవచం అబేధ్యం కాదని ఓ ఇజ్రాయెలీ సంస్థ నిరూపించింది.

ఇజ్రాయెలీ టెక్నాలజీ సంస్థ ఎన్‌ఎస్ఓ తయారు చేసిన పెగాసస్ అనే స్పైవేర్‌ను వాట్సాప్‌పై ప్రయోగించారు. ఇది మొబైల్‌లో ఎలా ప్రవేశిస్తుందో, ఆ తర్వాత ఏం చేస్తుందో తెలుసుకుంటే దిమ్మ తిరుగుతుంది.

ఏదో ఒక రోజు మీ ఫోన్‌కు వాట్సాప్ వీడియో కాల్ వస్తుంది. మీరు ఆన్సర్ చేస్తారు. చాలు, మీ ఫోన్‌లోకి పెగాసస్ ప్రవేశిస్తుంది. ‘ఆ, అంత తేలికగా నేను తెలియని నంబర్ నుంచి వచ్చే కాల్ ఎందుకు ఆన్సర్ చేస్తాను’s అనుకుంటున్నారా? పెగాసస్ బ్యూటీ ఏమంటే మీరు ఆ వీడియో కాల్ ఎత్తనక్కరలేదు. మీకు కాల్ వచ్చిందంటే చాలు. మీరు ఆన్సర్ చేయకపోయినా పెగాసస్ తిష్ట వేసిందన్న మాటే.

ఒకసారి మొబైల్‌లో ప్రవేశించిన తర్వాత పెగాసస్ రెచ్చిపోతుంది. మీ పాస్‌వర్డ్స్ అన్నీ పెగాసస్ కంట్రోలర్‌కు చేరతాయి. ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్ జాబితా, కాల్స్ వివరాలు, మెసేజ్‌లు.. ఫోన్‌లో ఉన్న సమస్తం న కంట్రోలర్‌కు చచేరిపోతాయి. ఇంకా ప్రమాదం ఏమంటే మీ ఫోన్‌ మీమీదే నిఘా పెట్టగల సాధనంగా మారిపోతుంది. కంట్రోలర్ తలచుకున్నదే తడవు మీ ఫోన్‌లో ఉన్న మైక్రోఫోన్, కెమేరా ఆన్ అవుతాయి.

వాట్సాప్ వీడియా కాల్ ఫీచర్‌లోని ఓ బలహీనతను ఆసరాగా చేసుకుని పెగాసస్ అనే స్పైవేర్ ఫోన్‌లో ప్రవేశిస్తున్నదన్న విషయాన్ని ఆ సంస్థ గత మే నెలల మొదటిసారిగా పసిగట్టింది. వాట్సాప్ వెంటనే రంగంలోకి దిగి పెగాసస్ లాంటి స్పైవేర్‌ను లోనికి అనుమతించే వీడియో కాల్ ఫీచర్ లోపాన్ని సరిచేసింది. దానిని వాట్సాప్ యూజర్లందరికీ అప్‌డేట్ రూపంలో పంపింది.

మరోపక్క వాట్సాప్ పెగాసస్ నిఘాపై దర్యాప్తు ప్రారంభించింది. మొత్తం మీద 1400 మంది వాట్సాప్ యూజర్ల మొబైళ్లను పెగాసస్ ఆక్రమించినట్లు దర్యాప్తులో తేలింది. ఆ యూజర్లలో ఎక్కువమంది హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, అసమ్మతివాదులు, దౌత్యవేత్తలు ఉన్నారు.

ఈ స్పైవేర్‌ వాడకానికి సంబంధించి వాట్సాప్ అమెరికా కోర్టులో ఎన్ఎస్ఓ సంస్థపై కేసు వేసింది. బహరైన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మెక్సికో ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థలు, మరికొన్ని దేశాల ప్రభుత్వాలూ ఎన్ఎస్ఓ నుంచి పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేశాయని వాట్సాప్  కోర్టుకు తెలిపింది.