బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా నాలుగవసారి పదవీ ప్రమాణం చేసిన బిజెపి నాయకుడు బిఎస్ యడియూరప్ప ఇంగ్లీష్‌లో తన పేరు స్పెల్లింగ్ మార్చారు. గతంలో Yeddyurappa గా తన పేరు రాసుకున్న యడియూరప్ప శుక్రవారం దానిని Yediyurappa గా మార్చారు. ఒక d బదులు ఒక i చేర్చారు.
ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం అలంకరించిన యడియూరప్ప ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిలో లేరు. చివరిసారి అయితే 48 గంటల పాటే పదవిలో ఉన్నారు. గత సంవత్సరం ఎన్నికలలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపి శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి అయిన యడియూరప్ప మెజారిటీకి కావల్సిన సంఖ్యాబలం సమకూర్చుకోలేనని స్పష్టం కావడంతో బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు.
సంఖ్యాశాస్త్రంపై నమ్మకంతో కాబోలు వల్ల ఈసారన్నా శాసనసభ గడువు తీరేవరకూ ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న ఉద్దేశంతో పేరు స్పెల్లింగ్ మార్చినట్లు కనబడుతోంది. నిజానికి ఇప్పుడు మార్చిన విధంగానే గతంలో యడియూరప్ప తన పేరు రాసుకునేవారు. పన్నెండేళ్ల క్రితం జనతాదళ్ – సెక్యులర్ మద్దతుతో మొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టినపుడు తన పేరు స్పెల్లింగ్ మార్చుకున్నారు. దానికి సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యులు కారణమని చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి కారణంతోనే పాత పద్ధతిలో పేరు రాయడం ప్రారంభించారు.