సాధారణంగా వాణిజ్య ప్రకటనలంటే ఎక్కడలేని గ్లామర్ ఒలకబోస్తూ.. తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేలాగే ఉంటాయి. కానీ ప్రముఖ రేజర్ల బ్రాండ్ జిల్లెట్ తాజాగా విడుదల చేసిన ప్రకటన మాత్రం.. జీవితంలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంది. తన కొడుక్కి షేవింగ్ ఎలా చేసుకోవాలో తండ్రి నేర్పే ప్రకటన అది. కేవలం షేవింగ్ మాత్రమే కాకుండా.. జీవిత పాఠాలను నేర్పిస్తున్నట్లుగా ఆ ప్రకటన ఉంటుంది. అందులో ఆ కొడుకు.. ఒక ట్రాన్స్ జెండర్ కావడం అసలు విషయం. ప్రముఖ ట్రాన్స్ జెండర్ హక్కుల కార్యకర్త శామ్సన్ బాంకీబంటూ బ్రౌన్ ఇందులో కొడుకు పాత్రలో నటించాడు. అతడు ఒక అద్దం ముందు నిలబడి, చేతిలో రేజర్ పట్టుకుని ఉండగా.. తండ్రి అతడికి వెనక నిలబడి, ఎలా చేసుకోవాలో వివరిస్తుంటారు. ‘‘భయపడకు, షేవింగ్ అంటే ధైర్యంగా ఉండటమే’’ అని ఆయన అంటారు.
https://youtu.be/I-XtGtdD4Yo
బ్రౌన్ లో మార్పునకు సంబంధించి ఇది ఒక కీలకమైన ముందడుగుగా నిలిచింది. ‘‘నేను షేవింగ్ చేసుకోగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని అతడంటాడు. గురువారం నాడు ఈ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసినప్పటి నుంచి ఇది వైరల్ అయింది. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా చూడగా.. 6వేల లవ్ లు, 3వేల లైకులు వచ్చాయి. తన ఫేస్ బుక్ పేజీలో బ్రౌన్ దీని గురించి వివరించాడు. ‘‘నా జీవితం ఎంత గొప్పదో నాకు తెలుసు. ఈ ప్రపంచంలో నేను ఇంకా బతికున్నానంటే అది నా కుటుంబం నుంచి అంది మద్దతు వల్లే. నాలాంటి చాలామంది ట్రాన్స్ జెండర్ సోదరులు, సోదరీమణులు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు గానీ, వాళ్లంతా నా అంత అదృష్టవంతులు కారు’’ అన్నాడు. మిగిలిన ట్రాన్స్ జెండర్లను కూడా ఈ ప్రకటన ప్రోత్సహిస్తుందని అతడు విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘‘ఈ ప్రపంచంలో మన ఉనికి కూడా ప్రేమతోను, మనం పొందేందుకు అర్హత ఉన్న మద్దతుతోను నిండి ఉంటుందని’’ అందరికీ తెలుస్తుందన్నాడు.
కొన్ని బ్రాండ్లు సంస్కృతిని కూడా ప్రభావితం చేయగలవని, చాలా ముఖ్యమైన కొన్ని అంశాల విషయంలో గొంతెత్తాల్సిన బాధ్యత వాటికి ఉంటుందని జిల్లెట్ తెలిపింది. గౌరవం, సమ్మిళితాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే సంస్థగా, వీరికి సంబంధించిన వ్యక్తిత్వాలను కూడా తాము స్వీకరించి, ప్రమోట్ చేయాల్సిన బాధ్యత తమకుందని తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది.
ట్రాన్స్ జెండర్ల హక్కులను కాలరాసేందుకు ట్రంప్ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం విశేషం. ఈ ప్రకటనను జిల్లెట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక రోజు తర్వాత డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఒక ప్రతిపాదన చేసింది. ట్రాన్స్ జెండర్ పేషెంట్లకు చికిత్సలు అందించడానికి కొందరు నిరాకరించే ప్రమాదం ఉందని, ఎల్జీబీటీల కోసం ప్రత్యేకంగా కొన్ని ఆరోగ్య కేంద్రాలున్నా, అవి బాగా దూరంగా ఉండటం, వాటికి గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సి రావడంతో వాళ్లు వాటిని వినియోగించుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయని తెలిపింది.
ఎట్టకేలకు ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని గుర్తించేలా సాంస్కృతిక, రాజకీయ అంశాలలోకి జిల్లెట్ ప్రవేశించేందుకు ఈ ప్రకటన దోహదం చేసింది. ఇంతకుముందు జనవరి నెలలో ‘వుయ్ బిలీవ్’ పేరుతో జిల్లెట్ మరో ప్రకటన విడుదల చేసింది. అందులో మగతనాన్ని సవాలు చేస్తున్నట్లుంటుంది. మహిళలను వేధించే మగవాళ్లు, ఒకరినొకరు ఏడిపించుకునే అబ్బాయిలు ఇందులో ఉంటారు. చెడ్డ ప్రవర్తనను ఆమోదించే పాప్ సంస్కృతి ప్రస్తావన కూడా ఇందులో ఉంటుంది. ‘‘కానీ చివరకు కొంత మారింది’’ అని నేరేటర్ చెబుతుంటారు. అప్పుడు #MeToo మొత్తం స్క్రీన్ అంతా కనిపిస్తుంది. ‘‘ఇక వెనక్కి వెళ్లేది లేదు. ఎందుకంటే, మేం మగవాళ్లలో అత్యుత్తములనే నమ్ముతాం’’ అని ఆ ప్రకటన చెబుతుంది.