ఏపిలోని వైసీపీ సర్కార్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఏపీ బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ ను విమర్శిస్తున్నా రాష్ట్ర పర్యటనలకు విచ్చేసిన సందర్భాల్లో కేంద్ర మంత్రులు మాత్రం వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తూనే ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో, కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ సర్కార్ మంచి ర్యాపో మెయింటెన్ చేస్తూనే ఉంది. ఆ కారణంగా రుణ పరిమితి విషయంలో, రాష్ట్రానికి రుణాల మంజూరు విషయంలో కేంద్రం సహకరిస్తూనే ఉంది. అంతే కాకుండా మరి కొన్ని విషయాల్లోనూ కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మంచిగానే ఉన్నాయి. కానీ జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్రం తోసి పుచ్చుతోంది. విభజన చట్టం హామీలు. ప్రత్యేక హోదా తదితర కీలక విషయాల్లో మడత పేచీ పెడుతోంది కేంద్రం.

పోలవరం నిర్వాసితుల పరిహారం చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని లోక్ సభ సాక్షిగా స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీ వంగా వీగ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పోలవరం భూసేకరణ పరిహారాన్ని నిర్వసితుల ఖాతాలో వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా ఆ ప్రతిపాదనను కేంద్రం ఆమోదం తెలపలేదని ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నందున నిర్వసిత కుటుంబాలకు కేంద్రమే నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్ర జలశక్తి మంత్విత్వ శాఖ తేల్చి చెప్పింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి అనుగుణంగా లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపి ప్రభుత్వం చేసిన ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని కేంద్ర మంత్రి షెకావత్ పేర్కొన్నారు.

భూసేకరణ, పునరావాసం పై రాష్ట్రం చేసిన ఖర్చుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగడం లేదనిషెకావత్ అన్నారు. భూసేకరణ కింద 2014 ఏప్రిల్ నుండి 2022 డిసెంబర్ వరకూ రూ.3,779.05 కోట్ల బిల్లులు రీయింబర్స్ మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తే అందులో రూ.3,431.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ చేసిందని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.2,267 కోట్ల బిల్లులను పంపితే అందులో రూ.2,110 కోట్ల బిల్లులను చెల్లించామన్నారు. సీఐఏ, సీడబ్ల్యు సిఫార్సుల ఆధారంగా ఎప్పటికప్పుడు బిల్లులను వెరిఫై చేసి చెల్లిస్తున్నామని గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు.