Dark mode: మొబైల్, ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా వాడుతున్నారా..? వాటి స్క్రీన్ ను ఎక్కువసేపు చూడటంతో కళ్లకు సమస్యలు వస్తాయని ఆలోచిస్తున్నారా..? దీని నుంచి మీ కళ్ళను రక్షించుకోవడానికి ఫోన్, కంప్యూటర్లను డార్క్ మోడ్లో ఉంచి వాడుతున్నారా? దీని వలన కంటిపై ఎక్కువ ఒత్తిడి పడదని మీరు ఫీల్ అవుతున్నారా..? మీరు కనుక ఇలా భావిస్తే.. మీకు నిరాశ తప్పదు.
ఎందుకంటే డార్క్ మోడ్ కళ్లను కాపాడుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు నిపుణులు. అయితే అయినా డార్క్ మోడ్ మంచిదా? కాదా? అనే ప్రశ్నకు సమాధానం ఈ క్రింద చూడండి.
డార్క్ మోడ్ Dark mode:
మొబైల్, కంప్యూటర్లో ఉండే తెలుపు లేదా లేత రంగులను నల్ల రంగు లేదా ముదురు రంగులోకి మార్చడాన్నే డార్క్ మోడ్ అని పిలుస్తారు. దాంతో అక్షరాలు ఈజీగా కనిపిస్తాయి. కొన్నింటిలో దీన్ని పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. మరికొన్నింటిలో ఆటోమాటిక్ గా మారిపోతుంది.
కళ్ళకు ఇది మంచిదేనా:
డార్క్ మోడ్ తో మీ కళ్ళపై ఎక్కువ భారం పడదనే భావం మీకు కలగొచ్చు. కానీ దీనికి తలనొప్పి, పొడి కళ్ళు వంటి లక్షణాలను నివారించే శక్తి మాత్రం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం ఎలక్ట్రానిక్ పరికరం స్క్రీన్ నుంచి వచ్చే నీలి కాంతి స్థాయిలను తగ్గిస్తుంది. అది చేసే హానిని మాత్రం కాదు.
ప్రయోజనాలు:
దృష్టిని రక్షించడానికి ఇది సాయం చేయకపోవచ్చు. కానీ ఈ మోడ్ లో మీరు ఫోన్ వాడితే త్వరగా నిద్ర పోవచ్చు. రాత్రిపూట నీలిరంగు కాంతిని ప్రసరించే పరికరాలను ఉపయోగిస్తే.. మీలో అప్రమత్తత పెరుగుతుంది, దీంతో నిద్రపోవడం కష్టమవుతుంది. డార్క్ మోడ్ నీలి కాంతిని తగ్గిస్తుంది. దాంతో నిద్ర పడుతుంది. ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది మీ ఎలక్ట్రానిక్ వస్తువుల బ్యాటరీ లైఫ్ ను పెంచుతుంది.